
సిద్ధుకు శిరోభారం
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర మంత్రి మండలిలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. చాలా మంది మంత్రులు తమ శాఖలను మార్చాలని పట్టుపడుతున్నారు. దీంతో సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తలపట్టుకుంటున్నారు. ఉత్తమ పోర్ట్‌ఫోలియోలుగా భావించబడే రెవెన్యూ, సాంఘిక సంక్షేమం, హోం, ప్రజాపనులు తదితర శాఖలన్నీ ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి సిద్ధరామయ్య అనుచరులుగా గుర్తింపు పొందిన శ్రీనివాస్‌ప్రసాద్, ఆంజనేయ, కేజే జార్జ్, మహదేవప్పలకు కేటాయించారు. దీని వల్ల చాలా కాలంగా కాంగ్రెస్‌లోనే ఉన్న వారికి అన్యాయం జరిగిందని శాఖ మార్పును కోరుకుంటున్న నాయకుల వాదన.
ముఖ్యంగా ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే, వైద్య విద్యాశాఖ మంత్రి శరణ ప్రకాశ్‌పాటిల్, గృహనిర్మాణ శాఖ మంత్రి అంబరీష్, ఇంధనశాఖ మంత్రి డీకే శివకుమార్ ఈ విషయంలో ముందున్నారు. వీరు అడపాదడపా తమకు కేటాయించిన మంత్రిత్వ శాఖలను మార్చాలని బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఎప్పుడైతే సతీష్ జారకిహోళి శాఖను మార్చారో అప్పటి నుంచి వీరు తమ నిరసన గళాన్ని తీవ్రతరం చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తోంది.
ఈ నేపథ్యంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ, పునర్‌వ్యవస్థీకరణ చేయడం తథ్యమని ఇటీవల బెంగళూరు పర్యటనలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోని దాదాపు 10 మంది సీనియర్ నేతలు కొందరు మంత్రి మండలిలో స్థానం సంపాదించడం కోసం లాబీయింగ్ తీవ్రతరం చేశారు. ఇలా ఒక వైపు మంత్రిత్వ శాఖలను మార్చాలనే ఒత్తిడి, మరో వైపు ఖాళీగా ఉన్న నాలుగు మంత్రిత్వ శాఖల కోసం పది మంది పోటీ పడుతుండడంతో సమస్యను పరిష్కరించడం సీఎం సిద్ధరామయ్యకు తలకు మించిన భారమవుతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులే స్పష్టం చేస్తున్నారు.