ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటన రాష్ట్ర మంత్రివర్గంలోని సీనియర్ అ....
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో మంత్రి వర్గం విస్తరణ,
పునఃవ్యవస్థీకరపై మొదలైన ఆందోళన
బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటన రాష్ట్ర మంత్రివర్గంలోని సీనియర్ అమాత్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ పర్యటన తర్వాత మంత్రి వర్గ విస్తరణతో పాటు పునఃవ్యవవస్థీకరణ కూడా ఉండబోతోందన్న సమాచారంతో వారికి కునుకు పట్టడం లేదు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రి వర్గ విస్తరణతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్లడంలో విఫలమైన వారిని మంత్రి వర్గం నుంచి తొలగించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సన్నద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి సీఎం ఇటీవల బెంగళూరులో మాట్లాడుతూ త్వరలో ‘మంత్రి వర్గ పునర్వవస్థీకరణ భాగంలో కొంతమందిని తప్పించబోతున్నాం. ఈ ప్రక్రియ ఏప్రిల్ రెండో వారంలోపు పూర్తి కావచ్చు.’ అని పేర్కొన్నారు. దీంతో మంత్రి వర్గ పునర్వవస్థీకరణలో భాగంగా ఎవరికి ఉద్వాసన పలుకుతారనే విషయంపై సీనియర్ మంత్రుల్లో భయం నెలకొంది.
సీనియర్ మంత్రులపై వేటు?
ఉద్యానశాఖను నిర్వహిస్తున్న శ్యామనూరు శివశంకరప్ప వయోభారంతో బాధపడుతుండటం వల్ల ఆయనను మంత్రి పదవి నుండి తప్పించాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. ఇక రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ప్రసాద్ అనారోగ్య కారణాలతో తన శాఖను సమర్ధవంతంగా నిర్వహించలేక పోతున్నారని హైకమాండ్‌కు నివేదిక అందింది. ఇక గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంబరీష్ ప్రజలతో పాటు అధికారులతో కూడా మమేకం కాలేకపోతున్నట్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందాయి. చాలా కాలంగా ఈయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఎడమొహం పెడమొహంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ రెబల్‌స్టార్ కూడా ‘తొలగింపు’ జాబితాలో ఉన్నట్లు సమాచారం.
ఇక రాష్ట్రంలో ఇటీవల మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరగడంతో జాతీయ స్థాయిలో కర్ణాటక పరువు వీధిన పడిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇందుకు హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ అసవర్థతే ప్రధాన కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే విషయాన్ని స్వపక్షంలోని కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే హై కమాండ్‌కు నివేదిక పంపించారు. అంతేకాక ఐఏఎస్ అధికారి డీ.కే రవి అనుమానాస్పద మృతికి సంబంధించి కూడా కే.జే జార్జ్ పై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కే.జే జార్జ్‌ను కూడా ఆ స్థానం నుంచి తప్పించి మరో అప్రాధాన్యత పదవి ఇవ్వొచ్చునని తెలుస్తోంది. ఈయనతోపాటు మరికొందరు సీనియర్‌లను సైతం మంత్రి మండలి పునఃవ్యవస్థీకరణలో భాగంగా వారి శాఖలను మార్చాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి వర్గంలోని సీనియర్‌లు తన మాట వినకపోవడం వల్లే సిద్ధరామయ్య ఈ నిర్ణయానికి వచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
‘మేడం’ ఆమోదం కూడా...
మంత్రి వర్గం మరింత చురుగ్గా పనిచేసేందుకు గాను అసమర్థులైన మంత్రులను తప్పించి వారి స్థానంలో కార్యదక్షత ఉన్న యువ ఎమ్మెల్యేలకు పదవులను అప్పగించాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గతంలోనే సిద్ధరామయ్యను ఆదేశించారు. ఆమేరకు సిద్ధరామయ్య నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నూతన నివేదికకు ఈ ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మేడంతో ఆమోద ముద్ర వేయించుకుని రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.