ఎర్ర అడ్డా..నారావారి గడ్డ ! | Red smuggling Impropriety in Naravaripalli | Sakshi
Sakshi News home page

ఎర్ర అడ్డా..నారావారి గడ్డ !

Published Mon, Dec 28 2015 9:15 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

ఎర్ర అడ్డా..నారావారి గడ్డ ! - Sakshi

ఎర్ర అడ్డా..నారావారి గడ్డ !

ఎర్రస్మగ్లింగ్‌కు అడ్డాగా నారావారిపల్లె
సీఎం ఇంటికి కూతవేటు దూరం నుంచే దుంగల తరలింపు
  చంద్రగిరికోట ప్రాంతాన్నీ అక్రమాలకు వాడుకుంటున్న పచ్చనేతలు
ఎర్ర వాహనాలకు పైలట్లుగా చంద్రగిరి, పాకాల నేతలు
సచ్చినోడిబండ ప్రాంతం నుంచే భారీగా ఎర్రస్మగ్లింగ్

 
 సీఎం చంద్రబాబునాయుడు స్వగ్రామమయిన నారావారిపల్లె ఎర్రచందనం అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆయ న ఇంటికి సమీపంలోని ఓ తోటనే పచ్చనేతలు డంపింగ్ యార్డుగా మార్చేశారు. శేషాచలం అడవుల నుంచి తెచ్చే దుంగల్ని ఇక్కడే దాచిపెట్టి.. రాత్రికిరాత్రే సరిహద్దులు దాటిస్తున్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానం కలగకుండా పాకాల, చంద్రగిరి నేతలు పెలైట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ తనిఖీలు చేసేందుకూ పోలీసులు సాహసించడం లేదు. ‘సాక్షి’  టాస్క్‌ఫోర్స్ పరిశీలనలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు..
 
 ‘సాక్షి’టాస్క్‌ఫోర్స్ బృందం
 సీఎం చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లె ఎర్రస్మగ్లింగ్‌కు కేంద్రబిందువుగా మారింది. కొందరు ‘పచ్చ’బాబులు స్మగ్లర్ల అవతారమెత్తి దర్జాగా అక్రమాలకు పాల్పడుతున్నారు. నిత్యం వందల టన్నుల ఎర్రదుంగల్ని సరి హద్దులు దాటించి సొమ్ముచేసుకుంటున్నా రు. దీన్ని అరికట్టడానికి చేపడుతున్న చర్యలు బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నా యి. ఇదేఅదునుగా కొందరు రెచ్చిపోతున్నా రు. సీఎం నివాసానికి అతి సమీపం నుంచే దుంగల్ని దాచి స్మగ్లింగ్‌కు సిద్ధపడుతున్నారు. అక్కడే ఉన్న ఓ తోటను హాల్ట్, లిఫ్టింగ్ పాయింట్‌గా మార్చేశారు.
 
 రాచబాటగా నారావారిపల్లె
 నారావారిపల్లె ఎర్రస్మగ్లింగ్‌కు రాచబాటగా మారింది. టీవల అదేగ్రామానికి చెందిన అధికారపార్టీ నాయకుని ఇంటి పక్కనే ఉన్న తులసిపెంటలో రూ.కోటి విలువజేసే 40 దుంగలు దొరికాయి. అంతకుమునుపు గ్రామానికి సమీపంలో తరలింపునకు సిద్ధంగా ఉంచిన రూ.70 లక్షల విలువైన 30 దుంగలను టాస్క్‌ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. కానీ ఈ కేసుల్ని పోలీసులు అటకెక్కించారు.
 
 అంతా గుట్టుగానే..
 నారావారిపల్లెలో చోటు చేసుకుంటున్న అక్రమాలు బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తపడుతున్నారు. కూలీలు దుంగల్ని కళ్యాణి డ్యామ్ నుంచి చెక్‌పోస్టు సమీపంలోని అండర్‌బ్రిడ్జి మార్గం మీదుగా తులసిపెంట వైపు మోసుక్తొసారు. వీటిని టీడీపీ కార్యాలయ సమీపంలో, చంద్రబాబు ఇంటికి సమీపంలోని తోటల్లో ఉన్న గంతల్లో నిల్వ చేస్తున్నారు. ఆపై వాహనాల్లో భీమవరం నుంచి కొత్తపేట - బందార్లపల్లె - పూతలపట్టు మీదుగా చెన్నైకి తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వగ్రా మం కావడంతో అధికారులు దాడులు చేసేందుకు సాహసించడంలేదు. పైగా ఆ గ్రామానికి చెడ్డపేరు వస్తుందని వెనుకడుగు వేస్తున్నట్టు కొందరు బాహాటంకంగా చెబుతున్నారు.
 
 డంపింగ్ కాదు హాల్టింగ్
 ఎర్ర దుంగలను డంపింగ్ చేసే స్మగ్లర్లు ఇప్పుడు రూటుమార్చారు. గతంలో నరికిన దుంగలను అడవిలోనే డంపింగ్ చేసేవారు. కానీ కొంతకాలంగా ఆయుధాలతో టాస్క్‌ఫోర్స్ కూంబింగ్ నిర్వహిస్తుండడంతో డంపింగ్‌లతో లాభంలేదని గుర్తించినట్టుంది. ఎప్పుడు నరికిన దుంగలను అప్పుడే అడవి నుంచి తరలిస్తున్నారు. ఈ క్రమంలో వాహనం వచ్చే సమయం వరకు కొన్ని ప్రాంతాలను హాల్టింగ్‌లుగా ఎంపిక చేసుకొంటున్నారు. ఇందుకు రాయలవారి చంద్రగిరి కోట ప్రాంతాన్నీ వదలడంలేదు.
 
  శేషాచలం అటవీ సరిహద్దుప్రాంతాలైన నెరబైలు, దేవరకొండ, ఏనుగుపాదం, కళ్యాణిడ్యాం, రంగంపేట, టేకుప్లాంట్, నారావారిపల్లె, చంద్రగిరికోట ప్రాంతాలను హాల్టింగ్ కేంద్రాలుగా మార్చుకుంటున్నారు. అలాగే అడవి నుంచి తీసుకొచ్చే దుంగలను రంగంపేట సమీపంలోని కాలిబాట గుండా టేకుప్లాంటు, నాగయ్యగారిపల్లె మీదుగా కోట వెనుక వైపు ఐతేపల్లెకు సమీపంలోకి చేర్చుతున్నారు. దుంగలు పోగయ్యాక  వాహనంలోకి ఎక్కించి చిత్తూరు మార్గంగుండా చెన్నై, బెంగళూరుకు తరలిస్తున్నారు. శేషాచలం నుంచి రంగంపేట మీదుగా నారావారిపల్లె, శేషాపురం, చిన్న రామాపురం, భీమవరం, మూలపల్లె, కొమ్మిరెడ్డిగారిపల్లె మీదుగా పాకాల, పూతలపట్టు పరిసరాల్లోని డంపింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
 
 ఎన్‌కౌంటర్ జరిగినా..
 గతంలో సచ్చినోడిబండ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది తమిళ కూలీలు మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి ఎర్రచందనం దుంగల తరలింపు కొంతవరకు ఆగుతుందని అందరూ భావించారు. కానీ ఏమాత్రం ఆగడంలేదు. ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత సుమారు రూ.30 కోట్ల విలువైన దుంగలు పట్టుబడడం పోలీసుల వైఫల్యానికి అద్దంపడుతోంది.
  
 సురక్షితమైన గేట్‌వేగా పడమటి ప్రాంతం
 పడమటి ప్రాంతం ఎర్రచందనం తరలించేందుకు సురక్షితమైన గేట్‌వేగా మారింది. వైఎస్సార్ జిల్లా నుంచి అనంతపురం జిల్లా కదిరి మీదుగా వచ్చే ఎర్రచందనం వాహనాలకు ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం, మదనపల్లె మండలాల మీదుగా వెళ్తుంటాయి. ఆయా ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల్లో నిఘా లేకపోవడం స్మగ్లర్లకు కలిసొస్తోంది. ములకలచెరువు పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడేళ్ల క్రితం వరకు భారీగా ఎర్రచందనం పట్టుబడింది. కానీ ఇప్పుడు ఆ జాడేలేదు. పెద్దమండ్యం మండలం నుంచి తంబళ్లపల్లె, ములకలచెరువు మీదుగా పెద్దతిప్పసముద్రం మండలంలోని చేలూరు, మల్లెల, పట్టెంవాండ్లపల్లె మీదుగా వాహనాలు దర్జాగా కర్ణాటకలోకి వెళ్తున్నాయి. వీటిని అరికట్టడంలో అధికారులు విఫలమవ్వడం విమర్శలకు తావిస్తోంది.           
 
 ఆ మామిడితోపు సరిహద్దులో..
 భాకరాపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ టీడీపీ నేత మామిడితోపు ఉంది. ఈ పరిసరాలు ఎర్ర స్మగ్లర్లకు అడ్డాగా మారుతున్నాయి. శేషాచలం అడవుల్లోంచి తరలించిన దుం గలను ఈ ప్రాంతంలో నిల్వ చేస్తున్నారు. ఇక్కడ ఏ ర్పాటు చేసిన తాత్కాలిక మట్టి రోడ్డు గుండా రాత్రిపూట వాహనాల్ని నేరుగా డంపింగ్ యార్డుకు రప్పిం చి ఎర్రదుంగల్ని లోడ్ చేస్తున్నారు. ఇటీవల పోలీసు లు జరిపిన దాడుల్లో ఇక్కడ సుమారు రూ.40 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి.
 
 బోడిరెడ్డిగారిపల్లె జంక్షన్ పాయింట్

 చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ పరిధిలోని బోడిరెడ్డిగారిపల్లె స్మగ్లర్లకు కేంద్రబిందువుగా మారింది. అడవి నుంచి  సుమారు 15 కి.మీ కాలిబాట ఉంది. ఇదే మార్గంలో కూలీలచేత అడవి నుంచి దుంగలు తీసుకొచ్చి డపింగ్ ప్రాంతాలకు చేర్చుతున్నారు. ఇక్కడ ఉన్న కూడలి నుంచి ఓ వైపు చిట్టేచర్ల మీదుగా భాకరాపేటకు, మరో మార్గం ఎర్రావారిపాళెం మీదుగా వెళ్తున్నాయి. అలాగే చింతకుంట, నెరబైలు మీదుగా బోడేవాండ్లపల్లె, ప్రసాద్‌నగర్, యల్లమంద మీదుగా పీలేరు సమీపంలోని జాతీయ రహదారిలో కలసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు, చెన్నైకి సులువుగా చేరుకునేందుకు అవకాశం కలుగుతోంది. ఎర్రావారిపాళెం మండలంలోని కొన్ని గ్రామాల నుంచి ఎర్రచందనం దుంగల్ని బ్యాగుల్లో కుక్కి బెంగళూరుకు చేరవేస్తున్నారు.
 
 అటవీ సరిహద్దు ప్రాంతాలే షెల్టర్ జోన్లు
 శేషాచలం అడవి నుంచి తీసుకొచ్చే దుంగలను అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఎవరికీ అనుమానం రాకుండా డంప్ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా చిట్టేచర్ల, చింత గుంట, బోడేవాండ్లపల్లె, నెరబైలు, కోటకాడపల్లె, ఉస్తికాయలపెంట, జిల్లేళ్లమంద, బసన్నగారిపల్లె, నూతనకాలువ, ఫించా, బసన్నగారిపల్లె, తిరుపతి రూరల్ మండలంలోని దళవాయి చెరువు, చంద్రగిరి మండలం రంగంపేట, శ్రీవారిమెట్టు, మూలపల్లె, కళ్యాణిడ్యాం ప్రాంతాలు షెల్టర్‌జోన్లుగా ఉన్నాయి.
 
 పింఛా టు బెంగళూరు
 చిత్తూరు-వైఎస్సార్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన ఎర్రావారిపాళెం, కేవీపల్లె, సంబేపల్లె, సుండుపల్లె మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాల నుంచి ఎర్రచందనం దుంగలను పింఛా పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆ తర్వాత పింఛా పరీవాహక ప్రాంతాల్లో దుంగల్ని పూడ్చిపెడుతున్నారు. అక్కడి నుంచి వాహనాల ద్వారా నూతనకాల్వ, గుండ్రేవారిపల్లె క్రాస్ మీదుగా కడప-చిత్తూరు మార్గం చేరుకుని కలికిరి, అంగళ్లు మీదుగా చీకలబైలు నుంచి కర్ణాటక సరిహద్దుల్లోకి తరలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement