- అత్యాచార ఘటనపై సర్కార్‌కు నివేదిక ఇస్తాం
- ఎత్తినహొలె పథకం టెండర్ ప్రక్రియ పూర్తి
- త్వరలో పనులు ప్రారంభం
- మంత్రి యూ టి ఖాదర్
కోలారు : జిల్లాలో అత్యాచార ఘటనలు పునరావృతమైతే పోలీసుశాఖపై కఠిన చర్యలు తీసుకుంటామనిరాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్‌జ మంత్రి యూటీ ఖాదర్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన జిల్లా స్థాయి పోలీస్ శాఖ ప్రగతి పరిశీలనా సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రెండు రోజుల వ్యవధిలో మాలూరు తాలూకా, కుప్పూరు గ్రామంలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, బంగారుపేట తాలూకా బేత మంగల గ్రామంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార యత్నం, నిందితులను అరెస్టు చేయడంలో జరిగిన జాప్యం తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ప్రజలు శాంతియుతంగా జీవించేలా అనువైన వాతావరణం కల్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
అత్యాచార, అత్యాచార యత్నం ఘటనకు సంబంధించి సీఎం, హోం మంత్రికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. అదేవిధంగా ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తుందన్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఈ విషయంపై ఇద్దరితో కలిసి చర్చిస్తానన్నారు. కలెక్టర్ స్వాధీనం చేసుకున్న అక్రమ ఇసుక లారీలను ఎస్పీ వదిలేశారనే ఆరోపణలున్నాయన్న విషయాన్ని పాత్రికేయులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా తనకు తెలియదన్నారు.
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు అధికారులతో చర్చిస్తానన్నారు. జిల్లాలో అనధికారికంగా నిర్వహించే పాఠశాలల వివరాలను వారం రోజుల్లో తెలపాలని డీఈఓ ను ఆదేశించామని తెలిపారు. అధికారులు ఇచ్చే జాబితాననుసరించి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాకు శాశ్వత నీటిపారుదల సౌలభ్యాలను అందించే ఎత్తిన హొళె పథకానికి టెండర్ ప్రక్రియ పూర్తయిదని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు.
పడమటి కనుమలలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందువల్ల పరమశివయ్య నివేదిక అమలు ఆలస్య మవుతోందన్నారు. అక్కడి ప్రజలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. సమావేశంలో ముళబాగిలు ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, మాలూరు ఎమ్మెల్యే మంజునాథ్ గౌడ, ఎస్పీ అజయ్ హిలోరి పాల్గొన్నారు.