గురి పెట్టి కాల్చి చంపారు! | Report on Thoothukudi fires In Tamil Nadu | Sakshi
Sakshi News home page

గురి పెట్టి కాల్చి చంపారు!

Published Tue, Jul 17 2018 7:07 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

Report on Thoothukudi fires In Tamil Nadu - Sakshi

తూత్తుకుడిలో కాల్పులు (ఫైల్‌)

ప్రజల్ని గురిపెట్టి తూపాకులతో కాల్చి మరీ చంపేశారని పోలీసులపై మక్కల్‌ విచారణ ఇయక్కం ఆరోపించింది. తమ విచారణలో వెలుగుచూసిన అంశాలతో కూడిననివేదికను సోమవారం ఆ ఇయక్కం విడుదల చేసింది. కాగా, స్టెరిలైట్‌ పరిశ్రమకు పడ్డ తాళాన్ని తొలగించేందుకు తగ్గ ప్రయత్నాల్ని ఆ యాజమాన్యం వేగవంతం చేసింది. ఇందుకు అద్దం పట్టే రీతిలో సిబ్బంది అందరూ విధులకు హాజరుకావాలని
ఆదేశాలు జారీచేసింది.

సాక్షి, చెన్నై : తూత్తుకుడిలోని స్టెరిలైట్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం కాల్పులకు దారితీసిన విషయం తెలిసిందే. మే 22వ తేదీ సాగిన ర్యాలీ అల్లర్లకు దారితీసింది. దీంతో పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు కాల్పులు జరిపారు. ఇందులో 13 మంది విగత జీవులయ్యారు. ఈ ఘటనపై పలు కోణాల్లో విచారణ సాగుతూ వస్తోంది. ఓ వైపు జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర కమిషన్‌ వేర్వేరుగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జస్టిస్‌ అరుణా జగదీశన్‌ నేతృత్వంలోని  కమిషన్, సీబీసీఐడీ నేతృత్వంలో... ఇలా అన్ని వైపులా విచారణసాగుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ ఘటనపై మక్కల్‌ విచారణ ఇయక్కం సైతం విచారణజరిపింది. కొన్ని రోజుల పాటు తూత్తుకుడిలో తిష్టవేసి పలు వర్గాల నుంచి సేకరించిన సమాచారాలు, సంఘటన స్థలంలో లభించిన ఆధారాలు, వివరాల మేరకు ఈ ఇయక్కం నివేదికను సిద్ధం చేసింది.

నివేదికలో తేటతెల్లం
కాల్పుల ఘటనపై ఇప్పటికే పోలీసులు, తూత్తుకుడి జిల్లా యంత్రాంగం మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. వీటికి బలం చేకూర్చే రీతిలో తాజా నివేదికలోని అంశాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ నివేదికను సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ విడుదల చేయగా, వర్తక సంఘం నేత వెల్లయ్యన్‌ అందుకున్నారు. అందులోని వివరాల మేరకు.. ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో చడీచప్పుడు కాకుండా పోలీసులు రాత్రికి రాత్రే 144 సెక్షన్‌ను అమల్లోకి తీసుకొచ్చారని వివరించారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయలేదని స్పష్టంచేశారు. ర్యాలీలో తమ కుటుంబాలతో కలిసి ప్రజలు పాల్గొన్నాయని,  శాంతియుతంగా సాగుతున్న ర్యాలీలో ఒక్కసారిగా పోలీసుల లాఠీ చార్జ్, తూటాలు ప్రజల్లో భయాందోళన సృష్టించాయని వివరించారు. లాఠీచార్జ్‌ తదుపరి యూనిఫాంలో లేని (మఫ్టీలో ఉన్న) వాళ్లు వాహనాల మీద ఎక్కి నేరుగా ప్రజల్ని గురిపెట్టి మరి తుపాకులతో కాల్చి పడేశారని ఆందోళన వ్యక్తంచేశారు. తుపాకీ కాల్పుల సమయంలో పాటించా   ల్సిన ఏ ఒక్క నిబంధనల్ని పోలీసులు అనుసరించలేదని, నేరుగా ప్రజల మీద గురిపెట్టి మట్టు బెట్టే రీతిలో కాల్పులు సాగించారని స్పష్టంచేశారు. ఇందులో విద్యార్ధిని నాన్సీ మరణం కూడా ఉందని పేర్కొన్నారు.  ఇలా మరెన్నో వివరాలను అందులో పొందుపరిచారు.

ఉన్నతాధికారుల్ని విచారించాలి
తూత్తుకూడి కాల్పుల ఘటనపై పూర్తిగా విఫలమైన ఆ జిల్లా యంత్రాంగం, విచ్చలవిడిగా కాల్పులు జరిపిన పోలీసులు, దీని వెనుక ఉన్న పోలీసు ఉన్నతాధికారుల్ని విచారించాల్సిన అవసరం ఉందని మక్కల్‌ విచారణ ఇయక్కం సూచించింది. తూత్తుకుడిలో ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉన్నా, పోలీసులు మాత్రం హడావుడి సృష్టిస్తూనే ఉన్నారని, అరెస్టులు, బలవంతపు నిర్భందాలు సాగుతూనే ఉన్నట్టు పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో ఆ ఇయక్కం ప్రతినిధులు హరి భరదన్, తిలక్‌ సెల్వరాజ్, షా విశ్వనాథన్, కృష్ణ దాసు గాంధీ, కవిత, గీత, రోశయ్య, రాందాసు తదితరులు పాల్గొన్నారు.

తాళం తెరిచేనా?
మూతపడ్డ పరిశ్రమను తెరిచేందుకు స్టెరిలైట్‌ యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఆ పరిశ్రమలోని రసాయనాలను ప్రస్తుతం ఆ జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో తొలగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని విధులకు హాజరవ్వాలని యాజమాన్యం ఆదేశాలివ్వడం చర్చకు దారితీసింది. ఈ పరిశ్రమలో రెండు వేల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు స్వస్థలాలకు వెళ్లిపోయారు. స్థానికంగా ఉన్న సిబ్బంది తూత్తుకుడిలోనే ఉన్నారు.  ఈ నేపథ్యంలో అందరూ విధులకు హాజరు కావాలని ఆ యాజమాన్యం ఆదివారం ఆదేశాలు  నుంచి వెళ్లడం, సోమవారం ఉదయాన్నే పరిశ్రమ వద్ద సిబ్బంది గుమిగూడడం చోటు చేసుకున్నాయి. పరిశ్రమకు అనుబంధంగా ఉన్న స్టాఫ్‌ క్వార్టర్స్‌ వద్ద సిబ్బంది అందరూ ఏకం అయ్యారు. అందరూ రిజిస్టర్‌లో సంతకాలు చేశారు. విధులకు హాజరు అవుతున్నట్టుగా సంతకాల తదుపరి, అక్కడే సిబ్బందితోపాటు ఆ పరిశ్రమ అధికారులు సమావేశం కావడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement