ఇసుక మాఫియాపై నివేదిక ఇవ్వాల్సిందే
Published Sat, Sep 28 2013 12:51 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
రాష్ట్రంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా వ్యవహారం పలు వివాదాలకు తెరదీస్తుండగా, తాజాగా ప్రభుత్వానికి తలనొప్పులు సృష్టిస్తోంది. ఇసుక అక్రమ రవాణాపై ఐఏఎస్ అధికారి విచారణ జరిపి సమర్పించిన నివేదికను తమకు అందజేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో తమకున్న ప్రత్యేకాధికారాలను ఉపయోగించి రాబట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి : తిరునల్వేలి, తిరుచ్చిరాపల్లి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లోని ఇసుక క్వారీ లీజుదారులు ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి వ్యాపారాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. లీజులో పేర్కొన్న హద్దులను అతిక్రమించి ఇసుకను తవ్వి విదేశాలకు రవాణా చేస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో ప్రభుత్వం రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి గగన్‌సింగ్ బేడీని ప్రత్యేకాధికారిగా నియమించి విచారణకు ఆదేశించింది. నెలరోజుల్లోగా ప్రాథమిక నివేదికను సమర్పించాలని గడువు విధించింది. గగన్‌సింగ్ బేడీ ఈ నెల మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదిక అందశారు.
దీంతో ప్రభుత్వం 77 క్వారీలకు నోటీసులు జారీచేసింది. అంతేగాక ఈ నాలుగు జిల్లాల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం విధించింది. ప్రభుత్వ చర్యలను సవాల్ చేస్తూ తిరునల్వేలికి చెందిన దయా దేవదాస్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇసుక మాఫియా అక్రమాలను అరికట్టాలని, సీబీఐతో విచారణ జరిపించాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్ శుక్రవారం న్యాయమూర్తులు వేణుగోపాల్, జయచంద్రన్‌తో కూడిన బెంచ్ వద్దకు విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సోమయాజి వాదనలు వినిపిస్తూ పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా అక్రమాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు.
విచారణ జరిపించి తవ్వకాలపై నిషేధం విధించిందని విన్నవించారు. అందువల్ల సీబీఐ విచారణ అవసరం లేదని పేర్కొన్నారు. దీనిపై జోక్యం చేసుకున్న న్యాయమూర్తులు ప్రభుత్వం వద్దనున్న విచారణ నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. అందుకు అడ్వకేట్ జనరల్ అభ్యంతరం చెబుతూ ప్రత్యేక రీతిలో ప్రభుత్వం జరిపించిన విచారణ నివేదికను కోర్టుకు సమర్పించడం కుదరదని పేర్కొన్నారు. న్యాయస్థానం కోరిన మీదట సమర్పించి తీరాలని, ధిక్కరిస్తే తమ ప్రత్యేకాధికారాలను ప్రభుత్వంపై ప్రయోగించి రాబట్టుకోవాల్సి ఉంటుందని న్యాయమూర్తులు హెచ్చరించారు. అక్టోబర్ 4వ తేదీ వాయిదాలోగా నివేదికను కోర్టు ముందుంచాలని ఆదేశించారు.
Advertisement
Advertisement