
తమిళంలోనే రివిజన్ టెస్ట్
హైకోర్టు ఉత్తర్వులు అమలుచేయని ప్రభుత్వం మైనార్టీ భాషల విద్యార్థులకు తప్పని తిప్పలు
హొసూరు: తమిళనాడు రాష్ట్రంలో వేలాది మంది మైనార్టీ భాషలు చదువుతున్న విద్యార్థులు వీధుల్లోకి వచ్చి తమ మాతృభాషలో చదువుకొనే అవకాశం కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్నివేడుకున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను తమ మాతృభాషలోనే రాసే అవకాశం కల్పించమని ప్రాధేయపడ్డారు. తమిళనాడు ప్రభుత్వం కనికరించలేదు. విద్యార్థులు రాష్ర్ట హైకోర్టు తలుపులు తట్టారు. హైకోర్టు 2015 నవంబర్ 23వ తేదీ ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలు వారి మాతృభాషలోనే రాసేందుకు అవకాశం కల్పిచమని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, విద్యార్థులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేస్తూ గడువిచ్చింది. వేలాది మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకొన్నారు. కానీ విద్యాశాఖ కార్యదర్శి దరఖాస్తులు చేసుకొన్న ప్రతి విద్యార్థికి లెటర్ అందజేసి తమిళం బోధించాము, తమిళంలో పరీక్షరాయాలని సూచించడంతో ఈ లెటర్‌ను సవాల్ చేస్తూ మాచినాయకనపల్లి ప్రభుత్వ హయ్యర్‌సెకెండరీ పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని గౌతమి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఈ కేసును విచారించి రెండవ సారి కూడా విద్యాశాఖకు 25.01.2016న స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
కానీ విద్యాశాఖ కోర్టు సూచనలను పెడచెవిన పెట్టి 10వ తరగతి చదుతున్న మైనార్టీ భాషా విద్యార్థులకు నిర్బంధంగా తమిళ పాఠాలు బోధిస్తోంది. వారి మాతృభాషలైన తెలుగు, కన్నడం, ఉర్దూ, మళయాళం భాషలను బోధించకపోవడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనయ్యారు. మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు ప్రారంభమైన రివిజన్ టెస్టులో మైనార్టీ విద్యార్థులకు తమిళంలో ప్రశ్నాపత్రాలు అందజేసింది. తమ మాతృభాషలోపరీక్షలు రాయమని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా తమకు రివిజన్ టెస్టులో తమిళ ప్రశ్నాపత్రం ఇవ్వడమేమిటని కోర్టుకెళ్లిన గౌతమి ప్రశ్నిం చింది. తనకు తమిళం రాదని, తాను తమిళ ప్రశ్నాపత్రానికి జవాబులు రాయలేదని గౌతమి సాయంత్రం భోరున విలపించింది. దీనిపై విద్యార్థులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం పట్టిం చుకోకపోతే భావిభారత పౌరులమైన తమకు కోర్టులపై, తీర్పులపై, భారత రాజ్యాంగంపై ఉన్న గౌరవం ప్రశ్నార్థకంగా మారుతుందని విద్యార్థులు అనుకుంటున్నారు.
మైనార్టీ విద్యార్థుల సమస్యలపై నేడు సమావేశం
రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను తమిళంలో నిర్వహించడంపై ప్రభుత్వ చర్యలను ఎదుర్కొనేందుకు హొసూరు ఎమ్మెల్యే కే. గోపీనాథ్ అధ్యక్షతన బుధవారం ఉదయం 10 గంటలకు ఆంధ్రసాంస్కృతిక సమితిలో మైనార్టీ భాషా సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగు, కన్నడ భాషాభిమానులు, సంఘాలు, పిల్లల తల్లితండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులకు వారివారి మాతృభాషల్లో విద్యనభ్యసించేందుకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై తదుపరి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.