ప్రేమపెళ్లి యత్నం.. రక్తసిక్తం
ప్రేమపెళ్లి యత్నం.. రక్తసిక్తం
Published Fri, Aug 18 2017 9:18 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
► మిత్రునికి సాయం వెళ్తూ నలుగురు యువకుల దుర్మరణం
► ఆటోను ఢీకొట్టిన లారీ
► చిత్రదుర్గం జిల్లాలో ఘోరం
పుణ్యానికి వెళ్తే పాపం ఎదురైనట్లు.. ఒక ప్రేమజంటకు పెళ్లిచేద్దామని సాయంగా వెళ్లిన మిత్రబృందం రోడ్డు ప్రమాదంలో అసువులు బాసింది. నాలుగు కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది.
కర్ణాటక: వారి స్నేహబంధంపై మృత్యువు కర్కశంగా పంజా విసిరింది. తమ బృందానికి తెలిసిన యువకుని ప్రేమ పెళ్లి చేసేందుకు వెళ్తూ నలుగురు మిత్రులూ మృత్యువాత పడ్డారు. చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా హర్తికోటె సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం రూపంలో విషాదం సంభవించింది. చిత్రదుర్గం సమీపంలోని మదకరిపుర, నంజయ్యన కొట్టిగెలకు చెందిన చరణ్ (22), చిదానంద (23), శరణ్ (24), మనోహర్ (21)లు స్నేహితులు. చరణ్ స్నేహితుడు ఒక యువతిని ప్రేమించాడు. ఆ ప్రేమజంట పెద్దలకు భయపడి ఇంటినుంచి పారిపోయి వచ్చింది. చరణ్ ఆ ప్రేమ జంటను తీసుకొని హిరియూరులోని కర్ణాటక రక్షణ వేదిక సంఘాన్ని ఆశ్రయించాడు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ప్రేమికుల జంటకు భద్రత కల్పించాలని కోరారు.
మృత్యుశకటమైన లారీ
తర్వాత ఆ జంటకు ప్రేమ వివాహం జరిపించాలని చరణ్, అతని స్నేహితులు నిర్ణయించారు. ఈ మేరకు శుభకార్యానికి ఆటోలో వెళ్తుండగా తాలూకా హర్తికోటె సమీపంలో లారీ ఢీకొంది. ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురూ అక్కడికక్కడే దుర్మరణం చెందగా అందులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఐమంగల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను, క్షతగాత్రులను హిరియూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం గాలింపు చేపట్టి లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Advertisement
Advertisement