'జీతాలు క్యాష్ పేమెంట్ చేయాలి'
విజయవాడ : కేంద్రప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దుపై తీసుకున్న నిర్ణయం వల్ల నవంబర్ నెల జీతాలు బ్యాంకుల ద్వారా కాకుండా నగదు రూపంలో ఇవ్వాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) ఉప ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు కోరారు.
విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిపితే డబ్బు కోసం డ్యూటీలకు సెలవు పెట్టి ఏటీఎంల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొంటాయన్నారు. దీంతో బస్సులు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగులకు క్యాష్ పేమెంట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ మాలకొండయ్యకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశామన్నారు. దీనిపై యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని ఈయూ నాయకులు చెప్పారు.