ముజఫర్‌నగర్ అల్లర్లు సమాజ్‌వాదీ పార్టీ నిర్వాకమే
Published Wed, Oct 9 2013 2:24 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
ముజఫర్‌నగర్: ప్రశాంతంగా ఉన్న ముజఫర్‌నగర్‌లో మతఘర్షణల చిచ్చు సమాజ్‌వాదీ పార్టీ ఢిల్లీ కలలకు తూట్లు పొడిచిందని భారతీయ కిసాన్ యూనియన్ వ్యాఖ్యానించింది. 62 మంది మృతి చెందడానికి, 45 వేల మంది నిర్వాసితులు అవడానికి కారణమైన మతఘర్షణలు సమాజ్‌వాదీ పార్టీ నిర్వాక ఫలితమేనని విమర్శించింది. బీకేయూ దివంగత నేత మహేంద్ర తికాయత్ 79వ జయంతి సందర్భంగా లక్నోలో జరిగిన సభలో పాలకపక్షం సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘‘ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒంటెత్తుపోకడతో వ్యవహరిస్తోంది.
ఓ మహిళ మీద అత్యాచారం చేసి ఇద్దరు స్థానిక యువకులను హత్యచేసిన నింది తులను అరెస్టు చేయడానికి సాహసించలేదు. తొలుత ఈ ఘటనలకు బాధ్యులైన నిందితులను విడిచిపెట్టాలని ఆదేశించింది. ప్రభుత్వాధికారులు మంత్రుల అధికార ఒత్తిడికి లొంగి ఒక వర్గానికి కొమ్ముకాసేరీతిలో వ్యవహరిస్తున్నారు. సూపర్ ముఖ్యమంత్రిగా పేరుపడిన ఓ మంత్రివర్యుడి ఒత్తిడి ప్రబలంగా ఉంది’’ అని బీకేయూ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ విమర్శించారు.
‘ప్రజా పనుల శాఖ మంత్రి శివపాల్‌సింగ్‌యాదవ్ సారథ్యంలో పది మంది మంత్రులతో కూడిన ఉపసంఘం ఘర్షణ ప్రాంతాల బాధితులను పరామర్శించడానికి వచ్చిన సందర్భంగా నిరసనలు ఎదుర్కొన్నారు. జిల్లా అధికారులు ఒక ప్రత్యేక మతవర్గానికే కొమ్ముకాస్తున్నారు. ఆగ్రహించిన మలేంది, లంక్ గ్రామాలకు చెందిన మహిళలు మంత్రులతో కూడిన అధికార వర్గాన్నియంత్రాంగాన్ని దాదాపు బందీలను చేసినంత పనిచేశారు. 20 నిమిషాల పాటు మంత్రి వర్గ ఉపసంఘాన్ని, అధికారులను చుట్టుముట్టారు. పోలీసులు గ్రామాలపై పడడంతో అవి దాదాపు ఖాళీ అయ్యాయి’ అని వివరించారు.
నిర్మానుష్యంగా మారిన గ్రామాల్లో మిగిలిన వికలాంగులు, పిల్లలు, మహిళలపై ప్రతాపం చూపిస్తున్నారు. అనేక మందిపై అక్రమంగా కేసులు నమోదు చేశారని ఆరోపించారు. కాగా సమాజ్‌వాదీ పార్టీ అధిపతి చిన్న తమ్ముడు స్థానిక మంత్రి అనురాధ చౌదురీని కలవడానికి వెళ్లినప్పుడు ముస్లిం ప్రజలు అతన్ని బందీని చేసినంత పనిచేశారు. నరేంద్రమోడీకి అనుకూలంగా ర్యాలీ నిర్వహించిన అనురాధను కలవడానికి ఆయన వెళ్లడాన్ని జీర్ణించుకోలేక వారు ఆయనకివ్వడానికి తెచ్చిన వినతి పత్రాన్ని చించిపారేసి నిరసన తెలిపారు.
పశ్చిమ ఉత్తరప్రదేశ్ పరిస్థితిని అఖిలేశ్ యాదవ్ మంత్రి వర్గంలోని ఓ మంత్రి విశ్లేషిస్తూ ‘‘ఇరు వర్గాల ప్రజలు పార్టీని వ్యతిరేకిస్తున్నారు. సమీప భవిష్యత్‌లో నేతాజీ (ములాయం) ఈ ప్రాంతాలను పర్యటించి పరిస్థితులను చక్కదిద్దుతారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. చెరకు పండించే ప్రాంతంలో ప్రజలు ముజఫర్‌నగర్ ఇన్‌చార్జీ మంత్రి మహ్మద్ అజామ్ ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారం నిందితులను వదిలిపెట్టాలంటూ ఆయన ఇచ్చిన ఆదేశాల కారణంగానే మత ఘర్షణల చిచ్చు పుట్టిందని ఆరోపించారు. దీనికి నిదర్శనం ఓ టీవీ చానల్ వారు చేసిన శూల శోధన. టీవీ చానల్ వద్ద మాట్లాడిన పోలీసు అధికారి ‘‘మేము మౌనం వహించి క్రియాశూన్యులుగా ఉండడానికి కారణం మంత్రి ఆదేశాలు’’ అని స్పష్టంగా చెప్పారు’’ అని తికాయత్ గుర్తు చేశారు.
బీజేపీ శాసనసభ్యులపై జాతీయ భద్రతా చట్టం ప్రయోగించడం ఎస్‌పీకి వ్యతిరేకంగా ప్రజలు స్పందించడానికి కారణమయిందన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి. ‘‘ప్రభుత్వం క్షమార్హం కాని రీతిలో ఏకపక్ష విధానం అనుసరిస్తోంది. ప్రతి పక్షనాయకుల మీద జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించడం, నిందితులను రక్షించి రాజధానికి తరలించడం ఉద్రిక్తలకు కారణంగా మారింది’’ బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహుద్దూర్ పాఠక్ వివరించారు.
సెప్టెంబర్ ఏడున ముజఫర్‌నగర్ పరిసరాల్లో చెలరేగిన మత ఘర్షణలు 62 మంది మరణానికి కారణం కాగా వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. వెల్లువెత్తిన నిరసన నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్ తన పర్యటనలను వాయిదా వేసుకున్నారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్వయంగా ఈ మతఘర్షణలు తన రాజకీయ జీవితంపై ఒక మాయని మచ్చగా నిలిచిపోతాయని వ్యాఖ్యానించారు. దీనికితోడు ఎస్‌పీపై ఈ ప్రాంత ప్రజల్లో ఉన్న విశ్వాసానికి విఘాతం కలిగింది. ఇది ములాయం ఢిల్లీ కలకు కూడా శరాఘాతమే అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీ, కాప్ పంచాయత్ నాయకులే కారణం: ఐద్వా
న్యూఢిల్లీ: ముజఫర్‌నగర్‌లో చెలరేగిన మత ఘర్షణలకు బీజేపీ, కాప్ పంచాయత్‌లే కారణమని అఖిల భారత ప్రజాస్వామిక మహిళా సంఘం (ఐద్వా) విమర్శించింది. సమాజంలోని ప్రజలను రెండుగా విడగొట్టిన మత, కుల నాయకుల కుట్రల ఫలితంగానే ఇవి చోటుచేసుకున్నాయని,ఆరోపించింది. మహిళా భద్రతను అడ్డుపెట్టుకొని మత, కుల నాయకులు ఈ హింసకు ఆజ్యం పోశారన్నారు. ‘ఓ మహిళపై జరిగిన దాడిని అడ్డుపెట్టుకొని మైనార్టీ వ్యతిరేకంగా హింసను ప్రేరేపించారు. వచ్చే శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ నరేంద్రమోడీ ప్రధాన అనుచరుడు, ఉత్తరప్రదేశ్ బీజేపీ పార్టీ బాధ్యుడు అమిషా దీనికి వ్యూహకర్త’అని ఐద్వా ప్రధాన కార్యదర్శి సుధా సుందరరామన్ ఆరోపించారు.
జోగియాఖేరా, లోయిలోని మతఘర్షణల బాధితుల పునరావాస శిబిరాలను పరిశీలించిన ఐద్వా బృందం మీడియాకు నిజనిర్ధారణ నివేదికను విడుదల చేసింది. ‘‘మత ఘర్షణల సందర్భంగా ఐదు అత్యాచార ఘటనలు మా దృష్టికి వచ్చాయి. లోయిలో నాలుగు కేసులు నమోదయ్యాయి. అయితే అభియోగ పత్రాలు దాఖలు చేయడానికి తప్పనిసరి అయిన బాధితురాండ్ర వాంగ్మూలాలను ఒక్క ఘటనలోనూ పోలీసులు నమోదు చేయలేదు. ఈ ఘటనలన్నింటిలోనూ అత్యాచారాలకు పాల్పడిన వారు వారి ఇరుగుపొరుగులే. పోలీసులకు నిందితుల పేర్లన్నీ తెలుసు అయితే ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు.
అత్యాచార సంఘటనల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దిగ్భ్రాంతికి లోనైన బాధిత యువతులు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఈ విషయం ఎత్తితే భయంతో వణికిపోతున్నారు’’ అని ఐద్వా ఢిల్లీ విభాగం కార్యదర్శి సెబా ఫారూఖీ ఆరోపించారు. ‘‘దాడులకు గురియైనవారంతా పేద మైనార్టీ వర్గానికి చెందిన వారే. వీరంతా దాడులు చేసిన వారి పొలాల్లో, సంస్థల్లో పనిచేసే వారే. మత ఘర్షణల సందర్భంగా జాడతెలియకుండా పోయిన పిల్లలను గురించి వచ్చిన ఫిర్యాదులను ఇప్పటి వరకు పట్టించుకోలేదు’’ అన్నారు. అన్ని అత్యాచార ఘటనలకు కారకులైన వారిని అరెస్టు చేయాలి. బాధితురాళ్లకు శిక్షణ పొందిన మానసిక వైద్య నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించాలి. శిబిరాలలోకి వెళ్లి మనో ధైర్యం కల్పించడానికి మహిళా సంఘాలకు అనుమతి ఇవ్వాలి’’ అని ఐద్వా బృందం డిమాండ్ చేసింది.
Advertisement
Advertisement