రాష్ట్రీయ లోక్ మంచ్ అధినేత అమర్ సింగ్
ఉత్తరప్రదేశ్లో అధికార పార్టీ సమాజ్వాది (ఎస్పీ) గూటికి మళ్లీ చేరే ప్రసక్తే లేదని ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ స్పష్టం చేశారు. బుధవారం రాత్రి లక్నోలో అమర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. గతంలో ఓ సారి చేసిన తప్పును మళ్లీ మళ్లీ చేయదలచుకోలేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలకు భద్రత కల్పించడంలో అఖిలేష్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తమైందన్నారు. ఈ సందర్బంగా ఎస్పీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్, రాష్ట్ర మంత్రి అజాం ఖాన్పై అమర్ సింగ్ నిప్పులు చెరిగారు.
అయితే అఖిలేష్ సమీప బంధువు, ప్రజా పనుల శాఖ మంత్రి శివపాల్ యాదవ్ను మాత్రం ఈ సందర్బంగా అమర్ ప్రశంసలతో ముంచెత్తారు. గతంలో ఆయనతో ఉన్న సానిహిత్యాన్ని ఈ సందర్బంగా అమర్ గుర్తు చేసుకున్నారు. ఈ నెల 27 తన జన్మదినమని, ఈ సందర్భంగా తన జన్మదిన వేడుకలు ముజఫర్ నగర్లో జరుపుకుంటున్నట్లు చెప్పారు. గతేడాది చివరలో ముజఫర్నగర్లో అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముజఫర్నగర్లో సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి దుపట్లు పంచనున్నట్లు అమర్ సింగ్ చెప్పారు.
గతంలో అమర్ సింగ్ సమాజ్వాది పార్టీలో ఓ వెలుగు వెలిగారు. అయితే ఆ పార్టీ అగ్రనేత ములాయం సింగ్, అమర్ సింగ్ల మధ్య వివాదం రాజుకుంది. దాంతో అమర్ సింగ్ సమాజ్వాదీ నుంచి బయటకువచ్చి, రాష్ట్రీయ లోక్ మంచ్ అనే కొత్త పార్టీని స్థాపించారు. 2012లో ఉత్తరప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికలలో అమర్ సింగ్ స్థాపించిన పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.