ఎన్నికలు ఎప్పుడు ? | congress rajya sabha mp parvez hashmi elections Whenever | Sakshi
Sakshi News home page

ఎన్నికలు ఎప్పుడు ?

Published Thu, Jul 31 2014 10:45 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

congress rajya sabha mp parvez hashmi elections Whenever

 న్యూఢిల్లీ: పేరుకే దేశరాజధాని అయినా, ఢిల్లీలో తాగునీరు, విద్యుత్ వంటి కనీస సదుపాయాలు కూడా సక్రమంగా లేవని రాజ్యసభలో విపక్షాలు గురువారం మండిపడ్డాయి. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశాయి. ఎన్నికలపై తాత్సారం ఎందుకని కేంద్రం ప్రభుత్వాన్ని నిలదీ శాయి. రాష్ట్రపతి పాలన వల్ల ఢిల్లీలో అభివృద్ధి పనులన్నీ కుంటుపడుతున్నాయని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ ఆక్షేపించాయి. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా వివిధ పక్షాల నాయకులు పలు అంశాలపై మాట్లాడారు. ఢిల్లీవాసులు ప్రతి చిన్న పనికీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)ను ఆశ్రయించలేరని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంటేనే సమస్యలు సులువుగా పరిష్కారమవ డానికి ఆస్కారం ఉంటుందని కాంగ్రెస్ ఎంపీ పర్వేజ్ హష్మీ అన్నారు.
 
 ఢిల్లీలో కరెంటు, తాగునీరు, గృహవసతి, రవాణా, విద్యకు డిమాండ్ పెరుగుతున్నందున, నిధులను మరింత పెంచాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయని, ఇంధనరంగానికి కేవలం రూ.200 కోట్లు కేటాయించడం వల్ల ఉపయోగమేదీ ఉండబోదన్నారు. విద్యుత్‌రంగాన్ని ఆధునీకరించేందుకు కనీసం రూ.మూడువేల కోట్లు అవసరమని హష్మీ అన్నారు. అధికారంలోకి వస్తే కరెంటు టారిఫ్ 30 శాతం తగ్గిస్తామన్న బీజే పీ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఈ మాటే మర్చిపోయిందని విమర్శించారు. కొత్త స్కూళ్లు, మురికివాడల్లో మురుగుదొడ్లు, రాత్రివసతి గృహాల నిర్మాణానికి మరిన్ని నిధులు అవసరమన్నారు.
 
 ప్రజాప్రభుత్వం ఏర్పాటుచేయండి: ఎస్పీ ఎంపీ నరేశ్ అగర్వాల్
 రాజకీయ వైరం, అపరిణితి వల్లే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. ప్రజల సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే సాధారణ ప్రభుత్వ ఏర్పాటు అనివార్యం. అంతర్జాతీయ నగరాలతో పోలిస్తే ఢిల్లీలో మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయి. పెరుగుతున్న వలసలకు తగినట్టుసదుపాయాలు అభివృద్ధి కావడం లేదు. అంతర్జాతీయ నగరాల్లో కరెంటు కోతలు అరుదుగానే ఉంటాయి. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల వరకు విద్యుత్ రావడం లేదు. ఎంపీలు నివసించే ప్రాంతాల్లో తాగునీరు, కరెంటు సమస్య ఉంది. ట్రాఫిక్ జామ్‌ల వల్ల ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడాలంటే రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి పోలీసుశాఖను తీసుకురావాలి. రవాణా, అనధికార కాలనీల సమస్యలను తక్షణం పరిష్కరించాలి.
 
 కరెంటు సమస్యపై దృష్టి సారించాలి: విజయ్ గోయల్, ఎంపీ (ఢిల్లీ బీజేపీ)
 పోటీని మరింత పెంచేందుకు ఢిల్లీలో మరిన్ని కరెంటు పంపిణీ సంస్థలు (డిస్కమ్)ను అనుమతించాలి. ప్రస్తుతం ఇక్కడ గుత్తాధిపత్యం నడుస్తోంది. నీటి ఎద్దడికి కొరతలు కారణం కాదు. సరఫరాలో లోపాలు, వృథా వల్లే సమస్యలు ఏర్పడుతున్నాయి. నగరంలో బహుళ అధికార వ్యవస్థలు ఉండడం వల్ల పాలన సంక్లిష్టంగా మారింది. ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలి. రాజధానిలోని విద్యాసంస్థల్లో 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు స్థానిక యూనివర్సిటీల్లో నాలుగుశాతం సీట్లు కేటాయించాలి.
 
 వీర్‌సింగ్, బీఎస్పీ ఎంపీ వీర్ సింగ్
 పేదల ఇళ్ల నిర్మాణం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం సరికాదు. అణగారిన విద్యార్థులకు హాస్టళ్లు నిర్మించాలి.
 కేసీ త్యాగి, జేడీ(యు) ఎంపీ నగరంలో తక్షణం ఎన్నికలు నిర్వహించండి. పార్టీలు ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడకుండా నియంత్రించాలి.  టీకే రంగరాజన్, సీపీఎం ఎంపీ కరెంటు, నీరు వంటి ప్రాథమిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం బడ్జెట్‌లో కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. వీరికితోడు బీజేడీ ఎంపీ బైష్ణబ్ పరీడా, సీపీఐ ఎంపీ రాజా కూడా ఢిల్లీ బడ్జెట్‌ను విమర్శించారు.
 
 త్వరలోనే పరిష్కారం: మంత్రి జైట్లీ
 ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న విపక్షాల డిమాండ్‌కు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ త్వరలోనే ఈ సమస్యకు రాజకీయ పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ప్రజాప్రభుత్వం లేకపోవడంతో వసల కల్పన ప్రాజెక్టులకు అడ్డంకులు ఎదురవుతున్నాయని అంగీకరించారు. రూ.36,777 కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టిన ఢిల్లీ బడ్జెట్‌కు శుక్రవారం పార్లమెంటు ఆమోదముద్ర వేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement