సంజయ్‌దత్‌కు నిబంధనలు వర్తించవా?
* బాలీవుడ్ నటునికి సెలవులు, పెరోల్‌ను సవాలుచేస్తూ పిటిషన్
* ప్రభుత్వాన్ని సమాధానం కోరి బొంబాయి హైకోర్టు
సాక్షి, ముంబై: అక్రమ ఆయుధాలు కల్గి ఉన్న కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు తరుచుగా లభిస్తున్న పెరోల్, సెలవులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సమాధానం ఇవ్వాలని బొంబాయి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పుణే జైలు సూపరింటెండెంట్, పుణే డివిజనల్ కమిషనర్‌లు తమకు గల విచక్షణాధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ తుషార్ పబాలే అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు వీఎం కనాడే, రేవతి మోహితే డేరేల ధర్మాసనం విచారణ జరిపింది.
డిసెంబర్ 2013-మార్చి 2014 మధ్య కాలంలో సంజయ్‌దత్ పెరోల్‌పై విడుదలైన సమయంలో పబాలే ఈ పిటిషన్ దాఖలు చేశారు. పబాలే తరఫు న్యాయవాది నిఖిల్ చౌదరి తన వాదనలు వినిపిస్తూ, ఓ ఖైదీ సెలవుపై బయటకు వచ్చిన తరువాత కనీసం ఒక సంవత్సరం పాటు జైలులో ఉండాలన్నారు. అంటే మరోసారి సెలవు మంజూరు కావాలంటే 365 రోజుల పాటు ఆ ఖైదీ శిక్షను అనుభవించాలి. ఒకవేళ మధ్యలో అతడు పెరోల్‌పై విడుదలైతే, ఆ రోజులను శిక్షా కాలంగా లెక్కించకూడదని పేర్కొన్నారు.
సంజయ్‌దత్‌కు అక్టోబర్ 2013లో 28 రోజుల పాటు సెలవు మంజూరైంది. తిరిగి డిసెంబర్ 2013లో నెల రోజుల పెరోల్ లభించింది. ఆ తరువాత ఆ పెరోల్‌ను మరో నెల రోజులు అనగా ఫిబ్రవరి 21 వరకు పొడిగించారు. తన భార్యకు అనారోగ్యంగా ఉందంటూ దత్ తన పెరోల్‌ను మరో నెల రోజులు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. అతని విజ్ఞప్తిని పుణే డివిజనల్ కమిషనర్ ఆమోదించడంతో సంజయ్ దత్ 2014 మార్చి 21న తిరిగి జైలుకు వెళ్లారు. దీంతో అక్టోబర్ 2013 నుంచి డిసెంబర్ 2014 మధ్య దత్ సెలవు, పెరోల్‌పై మొత్తంగా నాలుగు నెలలు జైలు వెలుపల ఉన్నారు. తిరిగి డిసెంబర్ 24, 2014లో దత్ సెలవుపై బయటకు వచ్చారు.
రెండోసారి సెలవు మంజూరు కావడానికి సంజయ్ దత్ జైలులో 365 రోజులు గడపలేదని న్యాయవాది ఆరోపించారు. పెరోల్‌పై విడుదలైన కాలాన్ని శిక్షా కాలంగా పరిగణించరాదని చెప్పారు. మే 16, 2013లో లొంగిపోయిన నాటి నుంచి సంజయ్ దత్ జైలు వెలుపల 134 రోజులు ఉన్నారని పేర్కొంటూ ఖైదీల పెరోల్, సెలవుల విషయంలో మార్గదర్శకాలు రూపొందించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.