రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి బోనస్‌ను బుధవారం ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం ప్రకటించారు. ఇందు కోసం రూ.325 కోట్లు కేటాయించారు.
సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత అధికారంలో ఉన్నప్పుడు ఏటా క్రమం తప్పకుండా సంక్రాంతి పర్వదినం సమీపించగానే ఉద్యోగులకు బోనస్ ప్రకటించడం జరుగుతూ వస్తోంది. అయితే, ఈ సారి అమ్మ అనంత లోకాలకు వెళ్లడం, పన్నీరు ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఉండడంతో బోనస్ ప్రకటన ఎప్పుడెప్పుడు వెలువడుతుందోనన్న ఎదురు చూపుల్లో ప్రభుత్వ ఉద్యోగులు పడ్డారు. ఈ సారి బోనస్ ఇచ్చేనా అని ఉత్కంఠ నెలకొన్నా, బుధవారం సీనియర్ మంత్రులు ఎడపాడి పళనిస్వామి, దిండుగల్ శ్రీనివాసన్, తంగమణి, ఎస్‌పీ.వేలుమణిలతో సీఎం పన్నీరుసెల్వం సమావేశం అయ్యారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ , అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశానంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా బోనస్‌ను ప్రకటించింది. ఆ మేరకు ప్రభుత్వం పరిధిలోని ఏ,బీ,సీ.డీ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల దరిచేర్చడంలో శ్రమిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం సంక్రాంతి బోనస్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అమ్మ జయలలిత ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం ఉద్యోగులకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రూ. 500 నుంచి 3 వేల వరకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఒక్కో ఉద్యోగికి రూ. 500 నుంచి రూ 3వేల వేల వరకు బోనస్ వర్తింప చేశారు.
2015–16కుగానూ సీ, డీ విభాగాల్లోని ఉద్యోగులకు 30 రోజుల వేతనానికి సమానంగా రూ. మూడు వేలు బోనస్‌ను ప్రకటించారు. అలాగే, ఏ, బీ విభాగాల్లోని ఉద్యోగులకు రూ. వెయ్యి అందజేయనున్నట్టు తెలిపారు. పెన్షన్ దారులు, కుటుంబ పెన్షన్ దారులు, మాజీ గ్రామ అధికారులకు రూ. 500 అందజేయనున్నట్టు వివరించారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి 240 రోజుల పాటు పనిచేస్తున్న ఒప్పంద, కాంట్రాక్టు ఉద్యోగులకు, ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తోన్న వివిధ విభాగాల సంక్షేమ ఉద్యోగులకు, అంగన్ వాడీ, పౌష్టికాహార పథకం తదితర సిబ్బందికి తలా రూ.వెయ్యి బోనస్ అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకుగాను మొత్తం రూ.325 కోట్ల 20 లక్షలను కేటాయించారు.
సంక్రాంతి స్పెషల్స్ పరుగు : పండుగ నిమిత్తం జనం స్వస్థలాలకు తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి ప్రత్యేక బస్సులు రోడ్డెక్కాయి. తొలి రోజు 3069 బస్సుల్ని రోడ్డెక్కించారు. గురు, శుక్రవారాల్లో చెన్నై నుంచి 11 వేల ప్రత్యేక బస్సులు పరుగులు తీయనున్నాయి. కోయంబేడు నుంచి తిరునల్వేలి, మదురై, తూత్తుకుడి, కన్యాకుమారి, కోయంబత్తూరు వైపుగా వెళ్లే బస్సులు బయలు నడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వైపుగా వెళ్లే బస్సులు అన్నానగర్ వెస్ట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్టాండ్ నుంచి రోడ్డెక్కించారు. పుదుచ్చేరి, కడలూరు, చిదంబరం వైపుగా వెళ్లే బస్సులు అడయార్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్టాండ్ నుంచి, వేలూరు, ఆరణి, ధర్మపురి, కృష్ణగిరి వైపుగా వెళ్లే బస్సులు పూందమల్లి బస్టాండ్ నుంచి, కుంభకోణం, తంజావూరు వైపుగా సాగే బస్సులు తాంబరం శానిటోరియం బస్టాండ్ నుంచి నడుపుతున్నారు.
ఇక, పండుగ నిమిత్తం ముందస్తుగా 96 వేల మంది రిజర్వేషన్ చేసుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇక, ట్రాఫిక్ పద్మవ్యూహంలో వాహనాలు చిక్కకుండా ముందుస్తుగా రూట్ మ్యాప్ సిద్ధం చేసి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలను నడిపే పనిలో పడ్డారు. అలాగే, ఆమ్నీ బస్సులు అత్యధిక చార్జీలు వసూళ్లు చేస్తున్నాయా అని ఆరా తీసి, భరతం పట్టేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. చెన్నై శివార్లలో ఈ బృందాలు తిష్ట వేశాయి.
భద్రత కట్టుదిట్టం: పండుగ సందర్భంగా చెన్నైలో భద్రతను కట్టుద్టిటం చేశారు. పదిహేను వేల మందితో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 15వ తేదీ కనుమ పండుగ సందర్భంగా జనసందోహం లక్షల్లో పర్యాటక, వినోద కేంద్రాలకు తరలి రావడం ఆనవాయితీ. ఈ దృష్ట్యా, నగరంలో ఇప్పటి నుంచే భద్రత చర్యలతో పాటు వినోద కేంద్రాలు, పర్యాటక కేంద్రాల్లో నిఘా పెంచారు. మెరీనా, బీసెంట్ నగర్ బీచ్‌లలో నిఘా నేత్రాల ఏర్పాటు, సముద్రంలోకి జనం దూసుకెళ్లని విధంగా బారికేడ్ల ఏర్పాటుకు తగ్గ చర్యలకు అధికార వర్గాలు సిద్ధమయ్యారు.