
న్యాయం జరగకపోతే చావే శరణ్యం
కోలారు : తమ కుమార్తె మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయడంలో పోలీసులు నిరక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మాకు న్యాయం జరిగే అవకాశం లేదని, తమకు చావే శరణ్యమని దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు. వివరాలు.. తాలూకాలోని కాళహస్తి పురానికి చెందిన నారాయణస్వామి, మునిరత్నమ్మ దంపతుల కుమార్తె ఎన్.రూపా జూన్ నెల 5న ఆత్మహత్య చేసుకుంది. తన సహచరులు నందిని, శీనల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆత్మహత్యకు ముందు లేఖ రాసింది. అంతేగాకుండా వీరిద్దరి వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సోదరుడు విజయకుమార్ మొబైల్‌కు మెసేజ్‌చేసింది.
ఈ ఆధారాలన్నింటితోపోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు ఇంతవరకు నిందితులను అరెస్టు చేయలేదని, తమకు దయా మరణానికైనా అనుమతించాలని పేర్కొన్నారు. పోలీసు అధికారులతో చర్చించి నిందితులపై చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం సమర్పణలో భారతీయ యువ రక్షణా ప్రధాన కార్యదర్శి అంబరీష్, జిల్లాధ్యక్షుడు ఎల్ మంజునాథ్‌గౌడ తదితరులు ఉన్నారు.