ఆ ఇద్దరికీ శాశ్వత ఉద్వాసన
ఆ ఇద్దరికీ శాశ్వత ఉద్వాసన
Published Mon, Nov 28 2016 2:34 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM
దక్షిణ భారత చలన చిత్ర రంగంలో ప్రముఖులుగా ఉన్న శరతకుమార్, రాధారవిలకు నడిగర్ సంఘం నుంచి శాశ్వతంగా ఉద్వాసన పలికారు. ఆ ఇద్దరిపై వేటు వేస్తూ ఆదివారం జరిగిన నడిగర్‌సంఘం సర్వ సభ్య సమావేశంలో తీర్మానించారు. ఇక, ముష్టియుద్ధాలు, దాడులు, ప్రతి దాడుల నడుమ సమావేశ ప్రాంగణం వెలుపల ఉత్కంఠ నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి.
చెన్నై : గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో నటుడు విశాల్ వర్గం గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా ఓటమి పాలైన శరత్‌కుమార్ వర్గం సంఘ నిర్వాకంలో పలు అవకతవకలకు పాల్పడినట్లు అధికారం చేపట్టిన నూతన కార్యవర్గం ఆరోపణలు చేసింది. ముఖ్యంగా సంఘ ట్రస్ట్ నిధికి సంబంధించి పలు అక్రమాలు జరిగినట్లు పేర్కొంటూ దానికి ప్రధాన ట్రస్టీలుగా బాధ్యతలు నిర్వహించిన శరత్‌కుమార్, రాధారవిలను సంఘం నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రటించారు. ఈ విషయమై శరత్‌కుమార్ వర్గం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో ఉండగానే ఆదివారం స్థానిక టీనగర్, అబిబుల్లా రోడ్డులో గల సంఘ ఆవరణలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవిలను సంఘం సభ్యత్వం నుంచి శ్వాశతంగా ఉద్వాసన పలుకుతూ తీర్మానం చేశారు. సంఘ అధ్యక్షుడు నాజర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎంజీఆర్ శతాబ్ది వేడుకలను, దివంగత ప్రముఖ కథాకారుల పేరుతో అవార్డుల ప్రధాన కార్యక్రమాలను నిర్వహించారు.
బి.సరోజాదేవికి మక్కల్ తిలకం అవార్డు
కాగా ప్రఖ్యాత నటి సరోజాదేవిని మక్కల్ తిలకం అవార్డుతో సత్కరించారు, అదే విధంగా నడిగర్ తిలకం అవార్డును నటి కాంచనకు, భానుమతి అవార్డును నటి ఊర్వశీ శారదకు, అంజలిదేవి అవార్డును, నటి వాణిశ్రీకి, ఎంఆర్.రాధ, తంగవేల్‌ల పేరుతో అవార్డును నటుడు వెన్నిరాడై మూర్తికి, టీపీ.రాజ్యలక్ష్మి అవార్డును ఎంఎస్.రాజ్యంకు, మనోరమ అవార్డును ఎస్.పార్వతికి, సహస్రనామ అవార్డును ఎన్‌ఎస్‌కే.థామ్‌కు, ఎస్‌ఎస్.రాజేంద్రన్ అవార్డును వినూచక్రవర్తికి అందించి ఘనంగా సత్కరించారు.
తమిళసినిమా శతాబ్ది అవార్డుల ప్రదానం
అదే విధంగా తమిళసినిమా శతాబ్ది అవార్డులను నటి బీఎస్.సరోజా, చో.రామసామి, శ్రీకాంత్, చారుహాసన్, కే.పురట్చిరాణి, ఎంపీ.విల్వనాథన్, ఎంఆర్.కన్నన్, కేఎస్‌వీ.కనకాంబరం, టీఆర్.తిరునావక్కురసు. వి.రాజశేఖరన్, ఎంఎస్.జహంగీర్, ఏఆర్.శ్రీనివాసన్, టీఎస్.జోకర్‌మణి, ఆర్.శంకర్, జి.రామనాథన్, పదార్థం పొన్నుసామి, ఆర్.ఎన్.బాలదాసన్, సీఆర్.పార్తిబన్, ఆర్.గుణశేకరన్, ఎంఆర్.విశ్వనాథన్, జే.కమల, టీఎస్.రంగరాజ్, ఒరు ఇరవు. వసంతన్, టీఎస్‌కే.నటరాజ్, నాంజల్ నళిని, కేకే.జూడోరత్నం, పీ.సరస్వతి,కే. పన్నీర్‌సెల్వం మొదలగు వారికి అందించి సత్కరించారు.
ఆందోళన, ముష్టి యుద్ధాలు:
సంఘం నుంచి తొలగించబడిన సభ్యులు, వ్యతిరేక వర్గం తమను సమావేశంలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వాలంటూ సమావేవ వేదిక ముందు ఆందోళనకు దిగారు. కొందరు సంఘ సభ్యులు వారిని అడ్డుకునే ప్రయత్రంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది.ముష్టి యుద్ధాలకు దిగారు.పలువురికి గాయాలయ్యారుు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేక పోవడంతో లాఠిచార్జి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆందోళన కారులను అరెస్ట్ చేశారు.
విశాల్ కార్యాలయం పై దాడి:
అదే విధంగా సంఘ ఉపాధ్యక్షుడు, శాసనసభ్యుడు కరుణాస్ కారుపై ఆందోళన కారులు దాడి చేసి కారు అద్దాలను పగులగొట్టారు.ఇక్కడ ఇలా ఆందోళన జరుగుతుండగా సంఘం కార్యదర్శి విశాల్ కార్యాలయంపై దాడి చేశారు. రాళ్లతో దాడి చేసి కార్యాలయం నిర్వాహకులను గాయపరచారు.
వేటును సమర్థించుకున్న నిర్వాహకులు
కాగా ఇలా ఉద్రిక్త వాతావరణంలో సంఘం సర్వసభ్య సమావేశం పూర్తి చేసిన నిర్వాహకులు శఅనంతరం మీడియా సమావేశంలో శరత్‌కుమార్, రాధారవిల సభ్యత్వం నిరంతర రద్దును సమర్థించుకున్నారు.ఈ సందర్శంగా కోశాధికారి కార్తీ మాట్లాడుతూ గత నిర్వాకంలో సంఘ ట్రస్ట్‌కు తొమ్మింది మంది ట్రస్టీలు ఉండాల్సింది, శరత్‌కుమార్, రాధారవి మాత్రమే మొత్తం అధికారం ఉండేటట్లుగా వ్యవహరించి సంఘ నిధికి సంబంధించి పలు ఆక్రమాలకు పాల్పడట్టు లెక్కల్లో తేలిందన్నారు.అందుకే వారిపై వేటు వేసినట్లు వివరించారు.ఇకపై అవినీతిని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశం జరగనివ్వకుండా కొందరు కావాలనే ఆందోళనకు దిగారని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు కార్యదర్శి విశాల్ తెలిపారు. నడిగర్ సంఘం నుంచి శాశ్వతంగా రద్దు చేయడంపై రాధారవి స్పందిస్తూ నడిగర్ సంఘంలో మేము అన్నీ కరెక్ట్‌గానే చేశామని, సంఘం నుంచి తొలగించడంపై కోర్టులో తేల్చుకుంటామని అన్నారు.
Advertisement
Advertisement