జైలు నిబంధనలకు విరుద్ధంగా శశికళ..
► నెలరోజుల్లో 28 మంది సందర్శకులు
► తెలుగుదేశం ఎమ్మెల్సీ మాగుంట మంతనాలు
► నిబంధనల అతిక్రమణతో దండన తప్పదంటున్న విశ్లేషకులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్షను అనుభవిస్తున్న శశికళ బెంగళూరు జైలులోనూ బిజీ బిజీగా గడుపుతున్నారు. జైలు నిబంధనలను తోసిరాజని నెలరోజుల్లో 31 మందితో చిన్నమ్మ మంతనాలు సాగించడం వివాదాస్పదమైంది. ఆస్తుల కేసులో దోషిగా నాలుగేళ్లపాటు ఆమె బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్షను అనుభవించాల్సి ఉంది. శశికళతోపాటు ఇళవరసి, సుధాకరన్ సైతం అదే కేసులో అదే జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అక్కడ ఆమెకు బైట నుంచి క్యారియర్ భోజనం, ఏసీ పడక, టీవీ, వార్తా పత్రికలు తదితర సౌకర్యాలు కల్పించినట్లు సమాచారం. ఆమెకు వీవీఐపీ వసతులు ఏవీ కల్పించలేదని, సాధారణ ఖైదీల నిబంధనలకు లోబడే వసతి కల్పించినట్లు జైలు అధికారులు చెబుతున్నారు. అయితే, జైలు నిబంధనలను శశికళ ధిక్కరించినట్లుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వ జైళ్లశాఖ నిబంధనల ప్రకారం ఒక ఖైదీ తన న్యాయవాది, బంధువులు, స్నేహితులతో 15 రోజులకు ఒకసారి, కేవలం 15 నిమిషాలు మాత్రమే మాట్లాడవచ్చు. అయితే ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఈ 31 రోజుల్లో 28 మందిని శశికళ కలుసుకుని సంభాషించినట్లు జైలు రికార్డులు చెబుతున్నాయి.
ఒక్కో సందర్శకునితో 15 నిమిషాలు మాత్రమే మాట్లాడాల్సి ఉండగా 40 నిమిషాలపాటు ఆమె సంభాషించారు. అంతేగాక మిలాఖత్ కోసం జైలు ఆవరణలోని ప్రత్యేక గదిని ఆమె వినియోగించుకున్నారు. నేడో రేపో ముఖ్యమంత్రి అయిపోతానని ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఆమె జైలు పాలయ్యారు. తమిళనాడులో అన్నాడీఎంకేలోని ఆమె వర్గమే అధికారంలో ఉన్నా ఆ సుఖ సంతోషాలు, భోగభాగ్యాలకు చిన్నమ్మ దూరమయ్యారు. అయినా జైలు నుంచే తమ వారికి ఆదేశాలు పంపిస్తూ పార్టీ, ప్రభుత్వంపై పెత్తనం సాగిస్తున్నారు. పార్టీ, రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్ వద్ద పన్నీర్ వర్గం సవాలు చేయడం, ఆర్కేనగర్‌లో ఉప ఎన్నికలు ముంచుకురావడం, దినకరన్ గెలిచి తీరాలనే పరిస్థితులు నెలకొనడం తదితర కారణాలు జైల చిన్నమ్మకు కునుకుపట్టకుండా చేస్తున్నాయి. అందుకే తరచూ తన వారిని పిలిపించుకుని మాట్లాడుతున్నారు.
చిన్నమ్మతో మాగుంట మంతనాలు
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ప్రముఖ పారిశ్రామికవేత్తగా వెలుగొందుతున్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గత నెల 1వ తేదీన చిన్నమ్మను జైల్లో కలుసుకుని 20 నిమిషాలపాటూ మంతనాలు జరపడం గమనార్హం. అలాగే, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఫిబ్రవరి 20 నుండి మార్చి 8వ తేదీ మధ్యన రెండుసార్లు కలుసుకున్నారు. ఈ రెండుసార్లు సుమారు 45 నిమిషాలపాటూ ఆమెతో మాట్లాడారు. పార్లమెంటు ఉప సభాపతి తంబిదురై, బంధువులు వివేక్, కార్తికేయన్, న్యాయవాదులు శశికలను కలుసుకున్న వారిలో ఉన్నారు. శశికళతోపాటూ అదే సెల్‌లో ఉన్న ఇళవరసి కేవలం నాలుగుసార్లు మాత్రమే బంధువులను కలుసుకున్నారు. ఇదే కేసులో మరో ఖైదీ సుధాకరన్ ఒకే ఒకసారి బెంగళూరుకు చెందిన తన న్యాయవాదితో మాట్లాడారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ
విదేశీ మారకద్రవ్యం కేసును ఎదుర్కొంటున్న శశికళపై గత కొంతకాలంగా చెన్నైలోని ఎగ్మూరు కోర్టు విచారణ సాగుతోంది. ఇందులో బాగంగా ఈనెల 10వ తేదీన విచారణ ఉంది. బెంగళూరు కోర్టు నుండి విడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాల్సిందిగా శశికళ తరపు న్యాయవాది కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేయగా మేజిస్ట్రేటు అంగీకరించారు. ఈ మేరకు 10వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శశికళ విచారణను ఎదుర్కొంటున్నారు.
దండన తప్పదా
జైలు నిబంధనలకు విరుద్ధంగా 31 రోజుల్లో 28 మందితో ములాఖత్ అయినందుకు శశికళకు ప్రత్యేక దండన తప్పదేమోనని అనుకుంటున్నారు. ఉన్నతాధికారుల కళ్లుగప్పి ఈ తప్పిదానికి పాల్పడ్డారా లేక లోపాయికారితనంగా అనుమతి పొందారా అని అనుమానిస్తున్నారు. నిబంధనలను ఆమె అతిక్రమంచినట్లు రుజువైతే తగిన చర్య తప్పదని భావిస్తున్నారు. అయితే శశికళ అంశంపై వివరణ ఇచ్చేందుకు జైలు అధికారులు నిరాకరిస్తున్నారు.