ఈసీకి వివరణ ఇచ్చిన శశికళ
చెన్నై: అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ తన నియామకంపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. పార్టీ నియమావళిని తాను ఉల్లంఘించలేదని, పార్టీ నిబంధనల ప్రకారమే తాను ఎన్నికయ్యాయని ఈసీకి తెలియజేశారు.
జయలలిత మరణానంతరం అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎన్నిక చెల్లదంటూ మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు ఈసీని ఆశ్రయించారు. ఈసీ నోటీసులు జారీచేయడంతో శశికళ వివరణ ఇచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ ప్రస్తుతం బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
లోక్‌సభలో ఆందోళన: జయలలిత మృతిపై సీబీఐతో విచారణ చేయించాలని లోక్‌సభలో అన్నా డీఎంకే ఎంపీలు డిమాండ్ చేశారు. అన్నా డీఎంకే ఎంపీల ఆందోళనతో సభ 10 నిమిషాలు వాయిదా పడింది.