చిన్నమ్మ ఎన్నిక చెల్లదు!
- నిర్ణయానికి వచ్చిన ఎన్నికల సంఘం
- విచారణ అనంతరం అధికారికంగా ప్రకటన?
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని ఎన్నికల కమిషన్(ఈసీ) నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అనే విధానమే అన్నాడీఎంకేలో లేదని ఈసీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గతేడాది డిసెంబరు 5న మరణించిన తరువాత అదే నెల 27న పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు తీర్మానం చేశారు. అదే నెల 31న పార్టీ కేంద్ర కార్యాలయంలో శశికళ బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చట్ట విరుద్ధమంటూ అన్నాడీఎంకే బహిషృత ఎంపీ శశికళ పుష్ప ఎన్నికల కమిషన్‌కు గతంలో ఫిర్యాదు చేశారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం పార్టీ నియమావళికి విరుద్ధమని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు మేరకు శశికళ ఎన్నిక తీర్మాన ప్రతిని కోరుతూ అన్నాడీఎంకేకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీచేసింది. ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్ శశికళ ఎన్నిక చెల్లదనే నిర్ణయానికి వచ్చినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని ఒక అధికారి కూడా నిర్ధారించారు. శశికళ నియామకం తీరుపై విచారణ జరిపి అధికారి కంగా ప్రకటిస్తామని అన్నా రు. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి బలవంతంగా తీసుకెళ్లారని, శశికళకు చెందిన ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి తీర్మాన పత్రాలపై సంతకం తీసుకున్నారని అన్నాడీఎంకే ప్రాంతీయ కార్యదర్శి మగిళన్బన్ బుధవారం మీడియాతో చెప్పారు. మరోవైపు జయ మరణంపై విచారణకు ఆదేశించాలని సామాజిక కార్యకర్త ‘ట్రాఫిక్’ రామస్వామి మద్రాసు హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు.