సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కరువు నినాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రకటనకు పట్టుబడుతూ అన్నదాతలు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. మంగళవారం కరూర్, ఈరోడ్, మదురై, నాగపట్నం, తంజావూరుల్లో ఆందోళనలు నిర్వహించారు. సర్కారుపై ఒత్తిడి తెచ్చి కరువు ప్రకటన చేయించుకోవడం లక్ష్యంగా రైతు సంఘాలు ముందుకెళుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు ప్రతి ఏటా రాష్ట్రాన్ని వెంటాడుతూ వస్తున్నాయి. పంట చేతికి అందక కొన్నేళ్లుగా అన్నదాతలు కన్నీటి మడుగులో మునుగుతున్నారు. అనేక జిల్లాల్లో పంట పొలాలు ఇళ్ల స్థలాలుగా మారుతున్నాయి. జలాశయాలను నమ్ముకున్నా, భూగర్భ జలాలను నమ్ముకున్నా చివరకు అన్నదాతలు కష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి. గత ఏడాది కరువు తాండవం మరింత తీవ్రం కావడంతో అన్నదాతలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. చెన్నై మినహా తక్కిన అన్ని జిల్లాలను కరువు ప్రాంతంగా ప్రకటించారు. తొలుత డెల్టా రైతులకు, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు నష్ట పరిహారం ప్రకటించారు. కేంద్రం ఆదుకోకపోవడంతో ఉన్నదాంతో సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మళ్లీ తాండవం: గత ఏడాది నైరుతీ, ఈశాన్య రుతు పవనాలు ముఖం చాటేశాయి. ఈ ప్రభావం తాజాగా రాష్ట్రాన్ని వెంటాడుతోన్నది. వర్షా భావ పరిస్థితులు, జలాశయాల్లో అడుగంటిన నీరు వెరసి కరువు తాండవం చేస్తోంది. వరుణుడు కరుణిస్తాడని పూజలు చేసినా ఫలితం శూన్యం. నీళ్లు లేక ఓ వైపు చేతికి అందాల్సిన పంట ఎండుతుంటే, మరో వైపు పంట పొలాలు బీడు భూములుగా దర్శనం ఇస్తుండడం అన్నదాతలను తీవ్ర ఆవేదనలోకి నెట్టేస్తోంది. బోరుబావులు ఎండిపోవడంతో ఇక ఈ ఏడాది సాగుబడికి దూరంగా ఉండడం మంచిదన్న నిర్ణయానికి వస్తున్నారు. తమను అదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకునే పనిలో పడ్డారు. డిమాండ్: భూగర్భ జలాలు, జలాశయాలు అడుగంటడం, పంటలు ఎండుముఖం పట్టడంతో ఈ ఏడాది కూడా కరువు ప్రకటన చేయాలన్న డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవల అన్నదాతలకు అండగా నిలబడే విధంగా రైతు సంఘాలన్నీ ఏకమయ్యాయి. అన్నదాతల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడికి రైతు సంఘాలు నిర్ణయించాయి. ఆ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి లక్ష్యంగా ఆందోళనకు శ్రీకారం చుట్టాయి.
ఆందోళన బాట: కరువు ప్రకటన చేయూలన్న డిమాండ్‌తో అన్నదాతలు తంజావూరు, కరూర్, నాగపట్నం, మదురై, ఈరోడ్‌లలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కరువు ప్రాంతంగా రాష్ట్రాన్ని ప్రకటించాలని, కావేరి జలాల పరిరక్షణ కమిటీ ఏర్పాటు, కావేరి సంక్షేమ బోర్డు ప్రకటన, మిథైన్ పైప్ లైన్లను తొలగించాలని కోరుతూ, అన్నదాతలు, రైతు సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఏఐఏడబ్యుయూ, వామపక్షాల అనుబంధ రైతు సంఘాల నేతృత్వంలో తంజావూరు కలెక్టరేట్‌లో భారీ నిరసన జరిగింది. కరూర్ అరవకుర్చిల్లో రాస్తారోకో, ఈరోడ్ టీఎన్ పాళయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మదురైలో, పొల్లాచ్చిలో ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనలు జరిగాయి. వేదారణ్యం, ముసిరి, నాగపట్నం, ఆండి పట్టి, ఊత్తాంకరైలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కరువు ప్రకటన వెలువడే వరకు రోజుకో రీతిలో నిరసన తెలియజేస్తుంటామని రైతు సంఘాలు హెచ్చరించాయి. కొన్ని సంఘాలు మాత్రమే ఆందోళనబాట పట్టాయని, దశల వారీగా మిగిలిన సంఘాలన్నీ భాగస్వాములు అవుతాయని రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు. అన్ని సంఘాల ఏకంతో ఓ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనకు సిద్ధం అవుతామని, అంతలోపు ప్రభుత్వం స్పందించి కరువు ప్రకటన తప్పకుండా చేస్తుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేయడం విశేషం.
మళ్లీ తెరపైకి కరువు
Published Tue, May 27 2014 11:28 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement