మహారాష్ట్రలో వరదలకు బ్రిడ్జి కూలిపోయి రెండు బస్సులు కొట్టుకుపోయిన ఘటనపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ రెండు బస్సుల్లో కలిపి గల్లంతయిన 22 మందిలో ఇప్పటివరకు అయిదు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇందులో ముగ్గురు పురుషులు, ఇద్దరు స్త్రీలు ఉన్నారు. మరణించిన వారిలో ఓ బస్సు డ్రైవరు కూడా ఉన్నాడు. 20 బోట్లలో 160 మంది కోస్ట్‌గార్డులు, కొంత మంది స్థానిక జాలర్లు, ఈతగాళ్లు ప్రతికూల వాతావరణంలో సైతం గాలింపులు జరుపుతున్నారని అధికారులు తెలిపారు.
ఈ రెండు బస్సులే కాకుండా మరిన్ని వాహనాలు కూడా కొట్టుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. స్థానిక యంత్రాంగం ఫిర్యాదుల కోసం ఓ హెల్ప్‌లైన్(1077, 02141-222118) కూడా ఏర్పాటు చేసింది. నీటి ఉధృతి కారణంగా గాలింపులు కష్టంగా ఉన్నాయని భద్రతా బలగాల్లోని ఓ జవాను తెలిపారు. పాత బ్రిడ్జిల స్థితిగతులపై తనిఖీ... మహారాష్ట్రలో ఉన్న పాత బ్రిడ్జిల స్థితిగతులపై తనిఖీలు చేసేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉత్తర్వులు జారీ చేశారు. 2013లో అప్పటి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్‌కు కూలిపోయిన బ్రిడ్జి గురించి ఫిర్యాదులు అందాయని ఫడ్నవీస్ గుర్తు చేశారు.