సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో సీట్లు లభించని బీసీ విద్యార్థులకు నెలకు రూ.1,500 చొప్పున అందజేయనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్. ఆంజనేయ తెలిపారు. వసతి, భోజన ఖర్చుల కోసం ఈ మొత్తం ఇవ్వనున్నట్లు చెప్పారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ పథకం ప్రారంభమవుతుందన్నారు. శనివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ పీయూసీ, డిగ్రీ, ఇంజనీరింగ్, వైద్య, పీజీ, డీఎడ్, డిప్లొమా విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని వివరించారు.
ఈ నెల 28న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ ఏడాది సుమారు 20 వేల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి కలుగుతుందని చెప్పారు. దీని కోసం రూ.30 కోట్లను కేటాయించామన్నారు. ప్రతి నెలా విద్యార్థి అటెండెన్స్ ఆధారంగా ఈ మొత్తాన్ని నేరుగా అతని బ్యాంకు ఖాతాకు జమ చేస్తామని వెల్లడించారు. దీనికి ఆన్‌లైన్ ద్వారా కూడా అర్జీలను సమర్పించవచ్చని తెలిపారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కాగా ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు హాస్టళ్లలో ప్రవేశాన్ని నిరాకరించడానికి వీల్లేదని ఇదివరకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
ప్రత్యేక కార్యాలయాలు
వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడానికి ప్రతి తాలూకాలో అన్ని సదుపాయాలతో కూడిన కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఇలాంటి కార్యాలయాలున్నాయని చెప్పారు. తాలూకా కేంద్రాల్లో సూపరిండెంట్ స్థాయి అధికారి ఉన్నారని తెలిపారు. దీని వల్ల వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడానికి వీలు కావడం లేదన్నారు. ఈ ఏడాది ఆఖరు లోగా మొత్తం 175 తాలూకాల్లో ఈ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.
సీటు రాకుంటే ఆర్థిక సాయం
Published Sun, Sep 22 2013 2:25 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement