Public welfare hostels
-
నాడు ఫుల్.. నేడు నిల్ !
విద్యార్థులు లేక సంక్షేమ హాస్టళ్లు వెలవెల జంట జిల్లాల్లో 160 వసతి గృహాలు మొత్తం సీట్లు 15,800 చేరిన విద్యార్థులు 12,300 మంది ప్రస్తుత ఖాళీలు 3500 సిటీబ్యూరో: ఒకప్పుడు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో సీటు దొరకడం గగనం... నేడు చాలా సులభం. గతంలో విద్యార్థులతో కళకళలాడిన సంక్షేమ వసతి గృహాలు ఇప్పుడు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. పాఠశాలలు ప్రార ంభమై పక్షం రోజులైనా జంట జిల్లాల్లోని ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల ఖాళీలు భర్తీ కావడం లేదు. ప్రభుత్వ హాస్టళ్లలో చేరాలని ప్రైవేట్‌ను తలపించేలా సంక్షేమ శాఖ అధికారులు, వార్డెన్లు ప్రచారం చేస్తున్నా ఫలితాలు కనిపించడంలేదు. హాస్టళ్లను హేతుబద్ధీకరణ చేయాలన్న సర్కారు నిర్ణయం మేరకు సరిపడ విద్యార్థుల సంఖ్య లేని హాస్టళ్లలను విలీనం చేస్తామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో హాస్టళ్లలోని ఖాళీలను విద్యార్థులతో భర్తీ చేసేందుకు వసతి గృహాల సంక్షేమాధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని హాస్టళ్ల వైపు మొగ్గు చూపుతున్నట్లుగా విద్యార్థులు అర్బన్ హాస్టళ్లలో అడ్మిషన్ పొందటానికి శ్రద్ధ చూపటం లేదు. ప్రభుత్వం హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేయటంతో పాటు విద్యార్థుల మెను పెంచినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం ప్రాథమిక సౌకర్యాలు మెరుగ్గా లేకపోడమేనని తెలుస్తోంది. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలలో ఉన్న 160 సంక్షేమ హాస్టళ్లలో మొత్తం 15,800 సీట్లు ఉన్నాయి. ఈ హాస్టళ్లలో ప్రస్తుతం 12,300 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మిగతా 3,500 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం హాస్టళ్లలో 124కు మాత్రమే సొంత భవనాలు ఉండగా, మిగతా 36 హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. చాలీచాలని గదులు, సరైన స్నానపు గదులు, మరుగుదొడ్లు లేకపోవటం, అరకొర నీటి సౌకర్యం వంటి సమస్యలలతో ఇందులో ఉండే విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. ఎండ, వర్షం, చలి కాలాలను సైతం తట్టుకోలేని స్థితిలో ఈ భవనాలు ఉన్నాయి. దీంతో తమ పిల్లలను సంక్షేమ హాస్టళ్లలో చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గు చూపటం లేదు. గుర్తించని కారణాలివే ప్రభుత్వ పాఠశాలల్లో విద్య బోధన పటిష్టంగా లేకపోవటం. పాఠశాలలు ఒకచోట, హాస్టళ్లు మరో చోట ఉండటం. విద్యార్థులకు అవసరమైన ట్రంకు పెట్టెలు, యూ నిఫాం, పుస్తకాలు, నోట్ బుక్స్ వెంటనే ఇవ్వకపోవటంఆడపిల్లల భద్రతపై పటిష్ట చర్యలు తీసుకోకపోవడం అధికారుల పర్యవేక్షణ కొరవడటం, వార్డెన్లు స్థాని కంగా ఉండకపోవటం. -
అన్నంలో బల్లి
నలుగురు ‘సంక్షేమ’ విద్యార్థులకు అస్వస్థత హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో బల్లి పడిన ఆహారం తిన్న నలుగురు విద్యార్థులు శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని చంపాపేట డివిజన్ రెడ్డికాలనీలోని వికలాంగుల ప్రభుత్వ బాలుర వసతిగృహంలో సిబ్బంది శనివారం రాత్రి విద్యార్థుల కోసం అన్నం, పప్పు, చామగడ్డ కూర వండారు. అయితే, విద్యార్థులు భోజనం చేసే సమయంలో షఫీయుద్దీన్ అనే పీజీ విద్యార్థికి అన్నంలో ఉడికిన బల్లి చేతికి తగిలింది. పరిశీలించి అది బల్లిగా నిర్ధారించుకున్నాడు. హస్టల్లోని 195 మంది విద్యార్థులకు గాను, అప్పటికే 78 మంది విద్యార్థులు భోజనం చేశారు. వీరిలో సురేష్, మశ్చేందర్, గుణశేఖర్లూ వాంతులు చేసుకున్నారు. తోటి విద్యార్థులు వెంటనే వారిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న సంక్షేమ శాఖ ఏడీ వెంకట్‌రెడ్డి, సూపరింటెండెంట్ హుటాహుటినా హాస్టల్‌కు వచ్చి అస్వస్థతకు గురైన విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. ఆ సమయంలో వార్డెన్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పల్లెకు పోదాం
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామపంచాయతీకో ప్రత్యేక అధికారిని నియమిస్తోంది. ‘గ్రామాభ్యుదయ అధికారి’ పేరుతో వీరిని నియమిస్తున్నట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. ఇందులో భాగంగా ఒక్కో గ్రామాన్ని ఒక అధికారికి దత్తత ఇస్తారు. మండలస్థాయి అధికారులకు ఆయూ గ్రామాల బాధ్యతలను అప్పగించనున్నారు. రాష్ట్రావతరణ దినోత్సవం నవంబర్ ఒకటి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు అన్ని విభాగాల జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల స్పెషలాఫీసర్లతో సోమవారం రాత్రి కలెక్టర్ కిషన్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ స్వీయ ఆలోచన జిల్లాలో మొత్తం 962 గ్రామాలున్నాయి. పంచాయతీ స్థాయిలో వీఆర్ఓలు, గ్రామ కార్యదర్శులు ఉన్నప్పటికీ సొంత విభాగాల విధులకే వారు పరిమితమవుతున్నారు. దీంతో పల్లెపల్లెనా అమలవుతున్న ప్రభుత్వ పథకాలు... వివిధ విభాగాలు చేపడుతున్న అభివృద్ధి పనులపై కనీస పర్యవేక్షణ కొరవడింది. నివేదికలకు... క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు పొంతన కుదరడం లేదని పలుమార్లు జరిగిన జిల్లాస్థాయి సమీక్ష సమావేశాల్లో తేలిపోయింది. వివిధ పథకాల అమలుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ.. జరుగుతున్న పనులపై సంబంధిత శాఖాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో లక్ష్య సాధనలో వెనుకబడిపోతున్నట్లు కలెక్టర్ గుర్తించారు. ఇటీవల రెవెన్యూ డివిజన్ల వారీగా నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం కూడా బయటపడింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్వీయ ఆలోచనతో ప్రత్యేక కార్యక్రమాన్ని తలపెట్టారు. గ్రామస్థా యి నుంచే మార్పు రావాలని.. అక్కడ పనులు, పథకాలు, ప్ర భుత్వ విభాగాల పనితీరు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ముందడుగు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. గ్రా మస్థాయిలో అన్ని శాఖల పనితీరు, అన్ని పథకాల లక్ష్య సాధనను పరిశీలించే బాధ్యతను ఒకే అధికారికి అప్పగిస్తే... లోపాలనుఅధిగమించే వీలుందని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. గ్రామాభ్యుదయ అధికారులు ఏం చేస్తారంటే... ప్రతి శుక్రవారం గ్రామాభ్యుదయ అధికారులు గ్రామాలను సందర్శిస్తారు. కార్యదర్శి, వీఆర్ఓ, ప్రధానోపాధ్యాయుడు, ఏఎన్ఎం, ఆశ వర్కర్, ఈజీఎస్ ఫీల్డ్అసిస్టెంట్లు, ఐకేపీ సీఏలు, హౌసింగ్ వర్క్ఇన్స్పెక్టర్లు, ట్రాన్స్‌కో లైన్మెన్ లేదా హెల్పర్, గోపాలమిత్ర, ఆదర్శ రైతు, అంగన్వాడీ టీచర్, రేషన్ డీలర్, పింఛన్లు పంపిణీ చేసే అధికారి, ఇతర విభాగాల గ్రామస్థాయి ఉద్యోగులతో సమావేశమవుతారు. తాగునీటి సరఫరా, పారిశుధ్యం, ఉపాధి హామీ పథకం, అంగన్ వాడీ కార్యక్రమాలు, అమ్మహస్తం సరుకుల పంపిణీ, ఇందిరమ్మ గృహ నిర్మాణం, మధ్యాహ్న భోజన పథకం. గ్రామ పంచాయతీ నిధులు, వివిధ ఇంజినీరింగ్ విభాగాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షిస్తారు. పనుల పురోగతి... లక్ష్యసాధన... సమన్వయలోపం... లోటుపాట్లను అధిగమించే చర్యలపై దృష్టి సారిస్తారు. అక్కడ జరిగిన నిర్ణయాలు, సమావేశం వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తారు. ప్రతి గ్రామానికో మెయిల్ ఐడీ కేటాయించి ఈ సమాచారం ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి శనివారం గ్రామాభ్యుదయ అధికారులందరూ మండల కేంద్రంలో సమావేశమవుతారు. గ్రామ స్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు ఆయా శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులతో చర్చిస్తారు. తహసీల్దార్, ఎంపీడీతోపాటు ఎంఈఓ, ఏఓ, ఏఈలు, మండల ప్రత్యేక అధికారులు ఈ కమిటీలో ఉంటారు. ఒకవేళ అక్కడ కూడా పరిష్కారానికి నోచుకోని సమస్యలుంటే.. వాటిని జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకొస్తారు. నెలకోసారి కలెక్టర్ స్థాయిలో ఈ సమావేశం జరుగుతుంది. జిల్లా అధికారులు క్షేత్ర పర్యటనలకు వెళ్లినప్పుడు మార్గమధ్యలో గ్రామాభ్యుదయ అధికారులు నిర్వహించే సమావేశాలకు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ విధానంతో సింగిల్ విండో సిస్టమ్ ఏర్పడుతుందని.. ప్రభుత్వ పథకాల పురోగతి మెరుగుపడుతుందని జిల్లా అధికారులు భావిస్తున్నారు. -
సీటు రాకుంటే ఆర్థిక సాయం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో సీట్లు లభించని బీసీ విద్యార్థులకు నెలకు రూ.1,500 చొప్పున అందజేయనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్. ఆంజనేయ తెలిపారు. వసతి, భోజన ఖర్చుల కోసం ఈ మొత్తం ఇవ్వనున్నట్లు చెప్పారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ పథకం ప్రారంభమవుతుందన్నారు. శనివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ పీయూసీ, డిగ్రీ, ఇంజనీరింగ్, వైద్య, పీజీ, డీఎడ్, డిప్లొమా విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని వివరించారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ ఏడాది సుమారు 20 వేల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి కలుగుతుందని చెప్పారు. దీని కోసం రూ.30 కోట్లను కేటాయించామన్నారు. ప్రతి నెలా విద్యార్థి అటెండెన్స్ ఆధారంగా ఈ మొత్తాన్ని నేరుగా అతని బ్యాంకు ఖాతాకు జమ చేస్తామని వెల్లడించారు. దీనికి ఆన్లైన్ ద్వారా కూడా అర్జీలను సమర్పించవచ్చని తెలిపారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కాగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు హాస్టళ్లలో ప్రవేశాన్ని నిరాకరించడానికి వీల్లేదని ఇదివరకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రత్యేక కార్యాలయాలు వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడానికి ప్రతి తాలూకాలో అన్ని సదుపాయాలతో కూడిన కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఇలాంటి కార్యాలయాలున్నాయని చెప్పారు. తాలూకా కేంద్రాల్లో సూపరిండెంట్ స్థాయి అధికారి ఉన్నారని తెలిపారు. దీని వల్ల వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడానికి వీలు కావడం లేదన్నారు. ఈ ఏడాది ఆఖరు లోగా మొత్తం 175 తాలూకాల్లో ఈ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.