అన్నంలో బల్లి
నలుగురు ‘సంక్షేమ’ విద్యార్థులకు అస్వస్థత
హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో బల్లి పడిన ఆహారం తిన్న నలుగురు విద్యార్థులు శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని చంపాపేట డివిజన్ రెడ్డికాలనీలోని వికలాంగుల ప్రభుత్వ బాలుర వసతిగృహంలో సిబ్బంది శనివారం రాత్రి విద్యార్థుల కోసం అన్నం, పప్పు, చామగడ్డ కూర వండారు. అయితే, విద్యార్థులు భోజనం చేసే సమయంలో షఫీయుద్దీన్ అనే పీజీ విద్యార్థికి అన్నంలో ఉడికిన బల్లి చేతికి తగిలింది. పరిశీలించి అది బల్లిగా నిర్ధారించుకున్నాడు. హస్టల్‌లోని 195 మంది విద్యార్థులకు గాను, అప్పటికే 78 మంది విద్యార్థులు భోజనం చేశారు.
వీరిలో సురేష్, మశ్చేందర్, గుణశేఖర్‌లూ వాంతులు చేసుకున్నారు. తోటి విద్యార్థులు వెంటనే వారిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న సంక్షేమ శాఖ ఏడీ వెంకట్‌రెడ్డి, సూపరింటెండెంట్ హుటాహుటినా హాస్టల్‌కు వచ్చి అస్వస్థతకు గురైన విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. ఆ సమయంలో వార్డెన్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.