నాడు ఫుల్.. నేడు నిల్ !
విద్యార్థులు లేక సంక్షేమ హాస్టళ్లు వెలవెల
జంట జిల్లాల్లో 160 వసతి గృహాలు
మొత్తం సీట్లు 15,800 చేరిన విద్యార్థులు 12,300 మంది
ప్రస్తుత ఖాళీలు 3500
సిటీబ్యూరో: ఒకప్పుడు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో సీటు దొరకడం గగనం... నేడు చాలా సులభం. గతంలో విద్యార్థులతో కళకళలాడిన సంక్షేమ వసతి గృహాలు ఇప్పుడు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. పాఠశాలలు ప్రార ంభమై పక్షం రోజులైనా జంట జిల్లాల్లోని ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల ఖాళీలు భర్తీ కావడం లేదు. ప్రభుత్వ హాస్టళ్లలో చేరాలని ప్రైవేట్‌ను తలపించేలా సంక్షేమ శాఖ అధికారులు, వార్డెన్లు ప్రచారం చేస్తున్నా ఫలితాలు కనిపించడంలేదు. హాస్టళ్లను హేతుబద్ధీకరణ చేయాలన్న సర్కారు నిర్ణయం మేరకు సరిపడ విద్యార్థుల సంఖ్య లేని హాస్టళ్లలను విలీనం చేస్తామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో హాస్టళ్లలోని ఖాళీలను విద్యార్థులతో భర్తీ చేసేందుకు వసతి గృహాల సంక్షేమాధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని హాస్టళ్ల వైపు మొగ్గు చూపుతున్నట్లుగా విద్యార్థులు అర్బన్ హాస్టళ్లలో అడ్మిషన్ పొందటానికి శ్రద్ధ చూపటం లేదు. ప్రభుత్వం హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేయటంతో పాటు విద్యార్థుల మెను పెంచినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం ప్రాథమిక సౌకర్యాలు మెరుగ్గా లేకపోడమేనని తెలుస్తోంది. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలలో ఉన్న 160 సంక్షేమ హాస్టళ్లలో మొత్తం 15,800 సీట్లు ఉన్నాయి. ఈ హాస్టళ్లలో ప్రస్తుతం 12,300 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు.
మిగతా 3,500 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం హాస్టళ్లలో 124కు మాత్రమే సొంత భవనాలు ఉండగా, మిగతా 36 హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. చాలీచాలని గదులు, సరైన స్నానపు గదులు, మరుగుదొడ్లు లేకపోవటం, అరకొర నీటి సౌకర్యం వంటి సమస్యలలతో ఇందులో ఉండే విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. ఎండ, వర్షం, చలి కాలాలను సైతం తట్టుకోలేని స్థితిలో ఈ భవనాలు ఉన్నాయి. దీంతో తమ పిల్లలను సంక్షేమ హాస్టళ్లలో చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గు చూపటం లేదు.
గుర్తించని కారణాలివే
ప్రభుత్వ పాఠశాలల్లో విద్య బోధన పటిష్టంగా లేకపోవటం. పాఠశాలలు ఒకచోట, హాస్టళ్లు మరో చోట ఉండటం. విద్యార్థులకు అవసరమైన ట్రంకు పెట్టెలు, యూ నిఫాం, పుస్తకాలు, నోట్ బుక్స్ వెంటనే ఇవ్వకపోవటంఆడపిల్లల భద్రతపై పటిష్ట చర్యలు తీసుకోకపోవడం అధికారుల పర్యవేక్షణ కొరవడటం, వార్డెన్లు స్థాని కంగా ఉండకపోవటం.