
రెండో దశ ప్రచార హోరు
షిండే, ఆశోక్ చవాన్, గోపీనాథ్ ముండే, సుప్రియా సూలే
సాక్షి, ముంబై: పశ్చిమ, ఉత్తర మహారాష్ట్రలతోపాటు మరాఠ్వాడలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎండవేడిమిని సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచి రాత్రి వరకు బహిరంగసభలు, రోడ్ షోలు, పాదయాత్రలు, వీధి సభలు, ఇంటింటి ప్రచారాలతో రాజకీయ నేతలు బిజీగా ఉంటున్నారు. ఈ నెల 17వ తేదీన జరగనున్న రెండో దశ ఎన్నికల్లో భాగంగా 19 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగే పోలింగ్‌లో గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు.
బరిలో 352 మంది...
రెండో దశలో 352 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే, మాజీ సీఎం అశోక్ చవాన్, బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే, శరద్ పవార్ కుమార్తె సుప్రీయా సూలే తమ అదృష్టాన్ని మరోమారు పరీక్షించుకుంటున్నారు. ఈసారి కూడా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్-ఎన్సీపీ ప్రజాస్వామ్య కూటమి, శివసేన-బీజేపీ, ఆర్‌పీఐ, స్వాభిమాని షేత్కారీ పార్టీల మహాకూటమి మధ్యే ప్రధాన పోటీ జరిగే అవకాశం కనబడుతోంది. అయితే పలు నియోజకవర్గాల్లో ఆప్, ఎస్‌పీ, బీఎస్‌పీ, ఎమ్మెన్నెస్‌లతోపాటు ఇతర పార్టీలు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
పశ్చిమ మహారాష్ట్రలో ....
పశ్చిమ మహారాష్ట్రలో మొత్తం 10 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. వీటిలో మరాఠా సమాజానికి చెందిన వారి ప్రాబల్యమే ఎక్కువగా ఉంది. పశ్చిమ మహారాష్ట్రలో సుశీల్‌కుమార్ షిండే, అనీల్ శిరోలే, సుప్రియా సూలే, విజయసింగ్ మోహితే పాటిల్, రాజు శెట్టి, రాహుల్ నార్వేకర్, విశ్వజీత్ కదం మొదలగు ప్రముఖ అభ్యర్థులు బరిలో ఉన్నారు. పశ్చిమ మహారాష్ట్రలో ఎన్సీపీకి మంచి పట్టున్నా, 2009 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. గత ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీ చేసిన ఎన్సీపీ కేవలం మూడు స్థానాల్లోనే విజయం సాధించింది. అదే మిత్రపక్షమైన కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేసి మూడింటిని గెలిచింది.
దీంతో ఈసారి ఎన్సీపీ ఆరు, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక మహాకూటమి గురించి చెప్పాలంటే పశ్చిమ మహారాష్ట్రలో పెద్దగా ప్రభావం లేదు. అయితే స్వాభిమాని షేత్కారీ పార్టీతో జతకట్టడంతో లాభం చేకూరనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2009 ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ మహారాష్ట్ర నుంచి ఖాతా కూడా తెరవలేకపోయింది. మిత్రపక్షమైన శివసేన ఐదు స్థానాల్లో పోటీ చేసి మూడింటిలో విజయం సాధించింది. ఒక స్థానాన్ని స్వాభిమాని పార్టీ నాయకుడు రాజు శెట్టి విజయం సాధించగా, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. అయితే ఈసారి ఓటరు నాడి ఎటువైపు ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
మరాఠ్వాడాలో...
మరాఠ్వాడాలో మొత్తం ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. జాల్నా, ఔరంగాబాద్ మినహా మిగతా ఆరు లోక్‌సభ స్థానాలకు రెండో దశలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ కూడా ప్రధాన పోటీ మహాకూటమి, ప్రజాస్వామ్య కూటమిల మధ్యనే జరగనుంది. ఇక్కడి నుంచి గోపీనాథ్ ముండే, అశోక్ చవాన్, పత్మసింగ్ పాటిల్ మొదలగు ప్రముఖ నాయకులు బరిలో ఉన్నారు.
2009 ఎన్నికలను పరిశీలిస్తే మరాఠ్వాడాలోని ఎనిమిది స్థానాల్లో ఐదు కాషాయకూటమి, మూడు ప్రజాస్వామ్య కూటమి దక్కించుకుంది. ఈసారి నరేంద్ర మోడీని ప్రధాని చేయాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ నేత గోపీనాథ్ ముండే మరాఠ్వాడాపై ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు మాజీ సీఎం ఆశోక్ చవాన్ మరాఠ్వాడాలో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
ఉత్తర మహారాష్ట్ర, కోంకణ్‌లో...
ఉత్తర మహారాష్ట్రలో మొత్తం పది లోక్‌సభ స్థానాలున్నాయి. అయితే రెండో దశలో కేవలం రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 12 లోక్‌సభ స్థానాలున్న కోంకణ్‌లో రత్నగిరి-సింధుదుర్గా లోక్‌సభ సీటుకు మాత్రమే ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. కోంకణ్‌లోని రత్నగిరిలో కాంగ్రెస్ నేత నారాయణ రాణే కుమారుడు నీలేష్ రాణే బరిలో ఉన్నారు.
మిత్రపక్షమైన ఎన్సీపీ స్థానిక నాయకులు, రాణే వర్గీయుల్లో విభేదాలున్నాయి. ఈసారి నీలేష్‌రాణేకు గట్టి పోటీ ఎదురుకానుందని తెలుస్తోంది. నీలేష్ రాణే కోసం తాము ప్రచారం చేయమని ఎన్సీపీ స్థానిక నాయకులు స్పష్టం చేశారు. రెండో దశ ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.