‘సమైక్య’ గళం!
Published Mon, Dec 16 2013 1:32 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, చెన్నై : భారత మాజీ ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా సమైక్య మినీ మారథాన్‌కు ఆదివారం బీజేపీ పిలుపునిచ్చింది. రాష్ర్టంలో 67 చోట్ల ఈ మారథాన్ నిర్వహించారు. కోయంబత్తూరు రేస్ కోర్సు రోడ్డులో, తంజావూరు కుంభకోణంలో, ఈరోడ్ గోబి చెట్టి పాళయంలో, వేలూరు రాణి పేటలో, తిరునల్వేలి తారాపురం, పుదుచ్చేరి బీచ్ రోడ్డులో, చెన్నై మెరీనా తీరంలో వేలాది మందితో మినీ రన్ విజయవంతంగా నిర్వహించారు.
సమైక్య పరుగు
బీజేపీ నాయకులతో పాటుగా పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు ఉదయాన్నే మెరీనా తీరం చేరుకున్నారు. మూడు వేల మంది వరకు యువత, విద్యార్థులు తరలి వచ్చి దేశ సమైక్యత నినాదాలతో హోరెత్తించారు. మెరీనా తీరం వెంబడి పరుగులు తీశారు. బీజేపీ అధికార ప్రతినిధి నిర్మల సీతారామన్ ఈ రన్‌ను ప్రారంభించారు. జాతీయ నాయకుడు ఇలగణేషన్, జాతీయ కార్యదర్శి తమిళి సై సౌందరరాజన్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, ఉపాధ్యక్షుడు హెచ్ రాజా, రాష్ట్ర కార్యదర్శి వానతీ శ్రీనివాసన్, వాణిజ్య సంఘం నాయకుడు వెల్లయ్యన్, పురట్చి భారత నేత జగన్ మూర్తి, మాజీ డీజీపీలు నటరాజ్, బాలచంద్రన్, న్యాయవాద సంఘం అధ్యక్షుడు పాల్ కనకరాజ్ తదితర ప్రముఖులు యువత, విద్యార్థులతో కలసి ఈ రన్‌లో పరుగులు తీశారు.
ఇనుము, మట్టి సేకరణ
గుజరాత్‌లో నిర్మించ తలబెట్టిన సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహం కోసం ఇనుము, మట్టి సేకరణకు రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. ఈ విషయమై బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్, రాష్ట్ర కార్యదర్శి వానతీ శ్రీనివాసన్ మాట్లాడుతూ, నర్మదా నదీ తీరంలో ఉక్కు మనిషి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన విషయం తెలిసిందేనని గుర్తు చేశారు. దేశ సమైక్యతను కాంక్షిస్తూ రాష్ట్రంలో చేపట్టిన మినీ మారథాన్‌కు విశేష స్పందన వచ్చిందన్నారు. రన్ ఫర్ యునిటీ అంటూ మోడీ ఇచ్చిన పిలుపుతో యువత కదలి వచ్చిందన్నారు. వల్లయ్ పటేల్ విగ్రహానికి రాష్ట్రంలోని పన్నెండు వేల ఐదు వందల గ్రామాల్లోని రైతుల నుంచి పాత ఇనుప సామన్లు, అన్ని గ్రామాల నుంచి పంట పొలాల్లో పిడికెడు చొప్పున మట్టి సేకరణకు శ్రీకారం చుట్టామన్నారు.
పొత్తుల చర్చా?
ఈ మినీ మారథాన్ ఆసక్తికర రాజకీయ పరిణామాలకు వేదికగా నిలిచింది. పలు చోట్ల ఎండీఎంకే, పురట్చి భారతం కట్చిలతో పాటుగా పలు ప్రజా సంఘాలు ఇందులో భాగస్వాములు అయ్యాయి. పుదుచ్చేరిలో జరిగిన మారథాన్‌లో ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, సీఎం రంగస్వామి పాల్గొని చర్చకు తెర లేపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజే పీతో కలసి అడుగులు వేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చాటేందుకే ఆయన ఈ రన్‌లో పాల్గొన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో జోరుగా సాగుతున్న బీజేపీతో పొత్తు కథనాలపై ఆ పార్టీ జాతీయ కార్యదర్శి తమిళి సై సౌందరరాజన్ స్పందిస్తూ, పొత్తులపై ఇంత వరకు ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ఎండీఎంకే నేత వైగో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన మాట వాస్తవమేనన్నారు. ఇది వరకు జరిగిన ఎన్నికల నుంచి ఆయన తమ వెంటే ఉన్నారని చెప్పారు. అంతేగానీ, ప్రత్యేకంగా ఏ ఒక్కపార్టీతోను రాష్ట్రంలో పొత్తుల గురించి ఇంత వరకు ఎలాంటి సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేశారు. పొత్తుల వ్యవహారం అధిష్టానం చేతిలో ఉందన్నారు. బీజేపీ జాతీయ నాయకుడు ఇలగణేషన్ పేర్కొంటూ, రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే రహిత కూటమి ఏర్పాటు లక్ష్యంగా ఇక్కడి నేతలందరూ ముందుకె ళుతున్నామని, అయితే, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందేనని పేర్కొనడం గమనార్హం.
Advertisement
Advertisement