ఆర్కేనగర్ ఉపఎన్నిక ప్రశాంతంగా పూర్తయింది. అయితే ఆశించిన మేరకు ఓటింగ్ శాతం పెరగకపోవడంతో అన్నాడీఎంకే వర్గాల్లో ఆందోళన బయలుదేరింది.
సాక్షి, చెన్నై :ఆర్కేనగర్ ఉపఎన్నిక ప్రశాంతంగా పూర్తయింది. అయితే ఆశించిన మేరకు ఓటింగ్ శాతం పెరగకపోవడంతో అన్నాడీఎంకే వర్గాల్లో ఆందోళన బయలుదేరింది. తమ అమ్మకు భారీ ఆధిక్యత దక్కని పక్షంలో ఎలాంటి పరిణామాల్ని చవిచూడాల్సి ఉంటుందోనన్న బెంగ పట్టిపీడిస్తోంది. ఇక పదవీ గండం తప్పదేమోనని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా ఆర్కేనగర్ ఉప ఎన్నికల్ని మలచుకునేందుకు అన్నాడీఎంకే కసరత్తులు చేపట్టింది. ఈ స్థానం బరిలో సీఎం, ఆ పార్టీ అధినేత్రి జయలలిత దిగడంతో, గెలుపు ఏక పక్షం అన్నది స్పష్టమయింది. ప్రధాన ప్రతి పక్షాలు బహిష్కరించినా, రేసులో సీపీఐ నిలవటం, స్వతంత్ర అభ్యర్థులు 26 మంది దిగడం వెరసి భారీ ఆధిక్యత మీద అన్నాడీఎంకే దృష్టి పెట్టింది.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ నాటి నుంచి అన్నాడీఎంకే జంబో జట్టు రంగంలోకి దిగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లలతో కూడిన యాభై మంది ఇన్‌చార్జ్‌ల బృందం, అనుబంధ బృందాలు ఇంటింటా తిరిగి ఓట్ల వేటలో పడ్డాయి. ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో నాయకుడు ఎంపిక చేసుకోవడం, ఆయా ప్రాంతాల్లోని వీధుల్ని తమ పరిధిలోని కింది స్థాయి నాయకులకు అప్పగించడం, ఏ ఇంట్లో అయితే, అత్యధిక ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లను రాబట్టేందుకు ఏకంగా ఓ నాయకుడ్ని రంగంలోకి దించడం వంటి వ్యూహాలు రచించారు. దానిని అమలు పరిచేందుకు ధన బలం నియోజకవర్గంలో తాంవడం చేసిందన్నది జగమెరిగిన సత్యం. తమ వ్యూహాల్ని విజయవంతంగా అమలు చేసిన అన్నాడీఎంకే సేనలు, ఆచరణలో విజయం సాధించారా..? అన్నది డౌటే.
సేనల్లో గుబులు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి విముక్తి లభించిన తరువాయి ఎదుర్కొంటున్న ఈ ఎ న్నికల్లో తమ అధినేత్రి జయలలిత మీద ప్రజల్లో ఏమేరకు విశ్వాసం, నమ్మకం, అభిమానం ఉన్నదో చాటుకునే విధంగా ఓట్ల శాతం పెంపుతో నిరూపించేందుకు చర్యలు చేపట్టారు. గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కే విధంగా ఓటింగ్ శాతం, మెజారిటీ వచ్చి తీరుతుందన్న ధీమాను నేతలందరూ వ్యక్తం చేశారు. అయితే, ఎన్నికల రోజు పరిస్థితి తారుమారైంది. తొలుత వంద శాతం ఓటింగ్ అన్న ఆ పార్టీ వర్గాలు తదుపరి 90 శాతానికి తగ్గారు. ఈ శాతం తప్పని సరిగా వస్తుందన్న ధీమాతో ఉన్న, ఆ పార్టీ వర్గాలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో వెట్రి వేల్ పోటీ చేసిన సమయంలో వచ్చిన శాతం కంటే, కేవలం రెండు శాతం మాత్రమే ఓట్లు పెరిగాయి. ఇది కాస్త అన్నాడీఎంకే వర్గాల్ని ఆందోళనలో పడేస్తోంది. ఓటింగ్ శాతం తగ్గినా, మెజారిటీ సంపూర్ణంగా ఉంటుందన్న భావనలో ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో సీపీఐకు అనుకూల వాతారణం నెలకొన్నట్టు సంకేతాలు ఉండడం గుబులురేకెత్తిస్తోంది.
పదవుల గండం
ఇది వరకు పలు ఉప ఎన్నికలు అన్నాడీఎంకే హయాంలో జరిగాయి. వీటిల్లో జయలలిత సూచించిన వ్యక్తి బరిలోకి దిగినప్పుడే ఓటింగ్ శాతం తారాస్థాయికి చేరి ఉన్నాయి. అయితే, స్వయంగా జయలలిత పోటీ చేసిన నియోజకవర్గంలో ఓటింగ్ శాతం తగ్గడం అన్నాడీఎంకే వర్గాల్ని ఆందోళనలో పడేస్తోంది. ముఖ్యంగా పార్టీలో, ప్రభుత్వంలో సీనియర్లుగా ఉన్నమంత్రుల్లో పదవీ గండం బయలుదేరి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ పదవులు ఊడిన పక్షంలో, మళ్లీ సీట్లు దక్కేది అనుమానమేనన్న ఆందోళనలో ఉన్నారు. పార్టీ తరపున ఇతర ఉపఎన్నికల్లో సాధారణ అభ్యర్థులు నిలబడ్డ చోటే ఏదేని తప్పులు దొర్లిన పక్షంలో కఠినంగా వ్యవహరించే జయలలిత, ఇక తాను పోటీ చేసిన స్థానంలో ఎదురయ్యే పరిణామాల మీద ఏ మేరకు స్పందిస్తారోనన్న భయం ఆ పార్టీ వర్గాల్లో వెంటాడుతోంది. ఇటీవలి కాలంలో జరిగిన తిరుమంగళం ఉప ఎన్నికలో 88 శాతం, ఏర్కాడులో 89.22 శాతం, శ్రీరంగంలో 81.79 శాతం, శంకరన్ కోవిల్‌లో 77.52 శాతం మేరకు ఓటింగ్ నమోదు కాగా, ఆర్కే నగర్‌లో 74.4 శాతం మాత్రమే నమోదు కావడంతో ఇక, ఎన్నికల ఫలితాల అనంతరం ఎవరి పదవి ఉంటుందో ఊడుతుందోనన్న చర్చ అన్నాడీఎంకేలో బయలుదేరింది. అలాగే, నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ బూత్‌ల వారీగా ఓట్ల వివరాల ఆధారంగా స్థానికంగా ఉండే నేతలతో పాటుగా, ఆయా ప్రాంతాల ఇన్‌చార్జ్‌లకు పదవీ గండం తప్పదేమో...!
స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలు
గెలుపు ఏకపక్షమైనా తమ పదవుల భవిష్యత్తును నిర్ణయించే ఈవీఎంలలోని ఓట్ల ఆధారంగా మెజారిటీ పెరగాలంటూ దేవళ్లను మొక్కే పనిలో అన్నాడీఎంకే సేనలు నిమగ్నం అయ్యాయి. ఇక, ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలను ఆయా పోలింగ్‌బూత్‌ల నుంచి తీసుకొచ్చి నగరంలోని రాణిమేరి కళాశాలలో భద్రపరిచారు. ఆ పరిసరాల్లో ఆరంచెల భద్రత కల్పించారు. ఈనెల 30 బుధవారం ఓట్ల లెక్కింపు పర్వం సాగనుంది. అందుకు తగ్గ ఏర్పాట్లలో ఎన్నికల యంత్రాంగం మునిగింది. ఇక, తమ పదవులకు గండం రాని రీతిలో ఫలితాలు రావాలన్న ఎదురు చూపుల్లో అన్నాడీఎంకే సేనలు నిమగ్నమయ్యాయి.