
ఆర్‌కే నగర్ ఉప ఎన్నికల్లో జయ ప్రచారం
తమిళనాడులోని ఆర్‌కే నగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో అభ్యర్థిగా బరిలో దిగిన సీఎం జయలలిత సోమవారం అక్కడ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
చెన్నై: తమిళనాడులోని ఆర్‌కే నగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో అభ్యర్థిగా బరిలో దిగిన సీఎం జయలలిత సోమవారం అక్కడ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నోర్ రోడ్డు జంక్షన్ వద్ద జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ‘వచ్చే ఏడాది జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు శుభ సూచికగా ఆర్‌కే నగర్ గెలుపును అందివ్వండి. నా సర్వస్వం మీరే. ఆర్‌కే నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషిచేస్తానని వాగ్దానం చేస్తున్నా.
ఎన్నికల్లో అన్నాడీఎంకేను భారీ మెజారిటీతో గెలిపించండి’ అని వందలాది మంది కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రాజకీయ కుట్రతో తనపై పెట్టిన కేసు కారణంగా గత ఏడాది సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిర్దోషిగా బయటపడ్డాక సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆమె ఆరు నెలల్లోపు అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి రావడంతో ఆర్‌కే నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ నేత పి.వెట్రివేల్ మేలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.