చెన్నై ఆర్కేనగర్ అన్నాడీఎంకే అభ్యర్థిగా ముఖ్యమంత్రి జయలలిత సోమవారం నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం చేశారు. దారిపొడవునా
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై ఆర్కేనగర్ అన్నాడీఎంకే అభ్యర్థిగా ముఖ్యమంత్రి జయలలిత సోమవారం నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం చేశారు. దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.ముఖ్యమంత్రి హోదాలో కొనసాగేందుకు ఆరు నెలల్లోగా జయ అసెంబ్లీ సభ్యత్వాన్ని పొందాల్సి ఉండగా, ఆర్కేనగర్ నియోజకవర్గం ఉపఎన్నికకు సిద్ధమయ్యారు. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలను బహిష్కరించగా, జయలలితపై ప్రధాన ప్రత్యర్థిగా సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ సహా మొత్తం 28 మంది ఆర్కేనగర్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థిగా జయ తొలిసారిగా నియోజకవర్గంలో ప్రచారం చేపట్టారు. సాయంత్రం 6 గంటల ప్రాంతం లో పోయిస్‌గార్డన్ నుంచి బయలుదేరిన జయకు దారిపొడవునా ఘనస్వాగతం లభించింది. రెండాకుల చిహ్నం చూపుతూ ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై పూలవర్షం కురిపిం చారు.
మహిళా కార్యకర్తలు నృత్యాలు చేస్తూ తమ నేతకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాత్రి 6.5గంటలకు కాశీమేడులోని ఎంజీఆర్ విగ్రహం వద్దకు జయ చేరుకోగా మంత్రులు, వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికా రు. ఎంజీఆర్ విగ్రహానికి మాలవేసిన అనంతరం తిరువత్తియూరు రహదారి కూడలి వద్ద రాత్రి 7.15 నుండి 7.30 గంటల వరకు జయ ప్రసంగించారు. 2011లో సోదర సమానుడు వెట్రివేల్‌ను ఇదే నియోజకవర్గం నుంచి పెద్ద మెజారిటీతో గెలిపించారు, మళ్లీ ఈ నియోజకవర్గంలో తాను పోటీచేయాల్సిన అవసరం వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తన హయాం లో చేపట్టిన పథకాలు, సంక్షేమకార్యక్రమాలే తనను గెలిపిస్తాయని జయ తన ప్రసంగంలో చెప్పారు. మొత్తం మూడు చోట్ల అమ్మ ప్రసంగించారు. అమ్మ పర్యటన సందర్భంగా పోలీ సులు పెద్ద ఎత్తున బందోబస్తు చేపట్టారు. అయినా అభిమాన జనాన్ని అదుపుచేయడం పోలీసులకు కష్టతరమైంది.