‘సేతు’కు కేంద్రం సై
* కేంద్ర మంత్రి పొన్‌కు మారిన బాధ్యతలు
* పరపతి పెంచుకునే పథకం
చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రంలో బలపడేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం సేతు సముద్ర పథకంపై దృష్టిపెట్టింది. అమలుకు నోచుకోక ఎన్నో ఏళ్లుగా వివాదంలో చిక్కుకుపోయిన ఈ పథకాన్ని పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో పరపతి పెంచుకునేందుకు సిద్ధం అయింది. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్‌కు నౌకాయాన శాఖా మంత్రిత్వ బాధ్యతలను అప్పగించడం ఇందుకు ఉదాహరణ. భారత్-శ్రీలంక మధ్య నౌకాయానాన్ని నెలకొల్పడం కోసం ఈ రెండు దేశాలను కలుపుతూ సేతు సముద్ర ప్రాజెక్టుకు గత యూపీఏ ప్రభుత్వం సంకల్పిం చింది.
ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆనాడు శ్రీలంకకు చేరుకునేందుకు శ్రీరాముడు కట్టిన వారధిగా భావిస్తున్న రామసేతు వంతెన బయటపడింది. సేతు సముద్ర ప్రాజెక్టు వల్ల చారిత్రాత్మక రామసేతు వంతెన ధ్వంసం అయిపోగలదనే వివాదం తలెత్తింది. రామసేతు వంతెనను పురాతన చిహ్నంగా ప్రకటించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయగా, ఆందోళనలు సాగిస్తూ మరి కొందరు కోర్టుకెక్కారు. ఎటూ తేల్చుకోలేని స్థితిలో యూపీఏ ప్రభుత్వం సేతు సముద్ర ప్రాజెక్టును దాదాపుగా అటకెక్కించే సింది.
బీజేపీ ఊతం: యూపీఏ ప్రభుత్వంలో తమిళ ప్రజలు నెరవేర్చుకోలేని పథకాలు, సమస్యలన్నీ బీజేపీ ప్రభుత్వానికి ఊతంగా మారాయి. ఇందులో భాగంగా సేతు సముద్ర ప్రాజెక్టు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చేరిపోయింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లాభపడాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. సేతు సముద్ర పథకం పరిశీలించాలని నౌకాయాన శాఖా మంత్రి నితిన్ గడ్కారినీ రాష్ట్రానికి పంపారు. ఈనెల 5న నితిన్ సైతం ఆకాశ మార్గంలో పయనిస్తూ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరీశీలించారు. కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రి పొన్ రాధాకృష్ణన్ సైతం నితిన్‌గడ్కారీ వెంట పర్యటించారు.
రామసేతు వంతెన దెబ్బతినకుండా సేతుసముద్ర ప్రాజెక్టును పూర్తి చేస్థామని నితిన్ ఆనాడే హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును వేగిరంగా పూర్తిచేయాలంటే రాష్ట్రంలో నమ్మకమైన వ్యక్తి అవసరం. నితిన్ పర్యటన ముగిసి ఐదురోజుల్లో కేంద్ర మంత్రి వర్గవిస్తరణ జరిగింది. భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రిగా వ్యవహిరిస్తున్న పొన్ రాధాకృష్ణన్ నౌకయాన శాఖా మంత్రిగా మారిపోయారు. సేతు సముద్రం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నౌకాయానశాఖ కేబినెట్ మంత్రిగా నితిన్ గడ్కారి ఇచ్చే సూచనలను అమలు చేసేందుకు అనువుగా సహాయ మంత్రి హోదాలో పొన్ సిద్ధమైపోయారు. సేతు సముద్ర ప్రాజెక్టును పరుగులెత్తించడం ద్వారా రాష్ట్రంలో పాతుకుపోయేందుకు బీజేపీ సమాయుత్తమవుతోంది.