‘ఫేస్‌బుక్’ కలకలం | Shiv Sena demands action, says FB post on Bal Thackeray derogatory | Sakshi
Sakshi News home page

‘ఫేస్‌బుక్’ కలకలం

Published Wed, Oct 16 2013 11:07 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

Shiv Sena demands action, says FB post on Bal Thackeray derogatory

సాక్షి ముంబై: శివసేన అధినేత దివంగత బాలాసాహెబ్ ఠాక్రేపై ఫేస్‌బుక్‌లో వచ్చిన అవమానకర సందేశంతో కళ్యాణ్‌లో మంగళవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శివసేన పార్టీని, బాలాసాహెబ్‌లను అవమానించారంటూ పెద్ద సంఖ్యలో శివసైనికులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అదుపు చేయడానికి తీవ్రంగా కష్టపడ్డారు. చివరికి అల్లర్ల నియంత్రణ బృందం, రాష్ట్ర రిజర్వు పోలీసు దళం రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా శివసేన దసరా ర్యాలీ ఉత్సవాల అనంతరం రెండో రోజున సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ‘ఫేస్‌బుక్’లోని ఒక పేజీలో శివసేన, ఆ పార్టీ అధినేత దివంగత బాలాసాహెబ్ ఠాక్రేలపై కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా సందేశాలను గుర్తుతెలియని వ్యక్తులు పోస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణ్‌లోని శివసేన నాయకుడు విజయ్ దల్వీ స్థానిక ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండేకు తెలిపారు. 
 
 అనంతరం ఈ సమాచారం నగరమంతటా దావానలంలా వ్యాపించింది. పార్టీ తరఫున నాయకులు వాగ్లే తదితరులు ఎస్టేట్ పోలీస్ స్టేషన్‌లో అలాగే సైబర్ క్రైం సెల్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా బాలాసాహెబ్‌ను అవమానించిన ఆ గుర్తుతెలియని వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించారు. అయితే సదరు అభ్యంతరకర పోస్టును దాదర్‌లో నివసించే ఒక వ్యక్తి లైక్ చేసినట్లు పార్టీ నాయకులు దత్తా దల్వీ, భావు కోర్‌గావ్కర్‌ల దృష్టికి వచ్చింది. వారు వెంటనే ఆ వ్యక్తిని పట్టుకొని నిలదీశారు. ఈ ఫేస్‌బుక్ పేజీని కళ్యాణ్ నివాసి ధనంజయ్ పాఠక్ తయారు చేశాడని అతడు చెప్పాడు.
 
 ఆ తర్వాత విషయం కళ్యాణ్‌కు చేరింది. దీంతో రాత్రి అనేక మంది శివసేన కార్యకర్తలు ఖడక్‌పాడా పరిసర ప్రాంతంలో ఉన్న ధనంజయ్ పాఠక్ ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు సకాలంలో జోక్యం చేసుకుని ధనంజయ్ పాఠక్ నిందితుడని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని శివసైనికులకు నచ్చజెప్పడంతో వారు చల్లబడ్డారు. శివసైనికులు ధనంజయ్ ఇంటికి వచ్చినప్పుడు అతడు ఇంట్లో లేడు.కాగా, తన భర్త నిర్దోషని, బాలాసాహెబ్‌ను అవమానించే విధంగా ఫేస్‌బుక్‌లో ఎటువంటి సందేశం పంపలేదని, ఎవరో అతడి అకౌంట్‌ను హ్యాక్ చేశారని ఆమె ఆరోపించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement