ఈ సారైనా లక్ వర్కౌట్ అవుతుందా?
కథానాయకి ఎంతైనా ఆ పేరులో ఉన్న మజానే వేరు. ఇక ఎంత క్రేజ్ ఉన్న నటికైనా అక్క, వదిన లాంటి పాత్రల్లో ఆ కిక్ ను పొందలేరు. ఒకప్పుడు కథానాయికిగా టాప్ స్థాయితో వెలుగొందిన నటి సిమ్రాన్. వివాహం చేసుకుని నటనకు దూరం అయ్యారు.అయితే చాలా మంది నటీమణుల్లాగే కొంత గ్యాప్ తరువాత నటిగా రీఎంట్రీ అయ్యారు. హీరోయిన్‌గా తన పూర్వ వైభవాన్ని చాటు కోవాలనుకున్నారు. ఒక నాటి అభిమానుల కలల రాణి సిమ్రాన్ కోరుకున్నట్లు గానే కథానాయికగానే పునఃప్రవేశం జరిగింది.అయితే మలయాళంలో హీరోయిన్‌గా నటించిన చిత్రం ఆమె ఊహించినట్లు విజయం సాధించలేదు.
ఇక తమిళంలోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలే పలకరించాయి. అలాగే హరి దర్శకత్వంలో సేవల్ చిత్రంలో ముఖ్యపాత్రతో కోలీవుడ్‌లో రీఎంట్రీ అయ్యారు.ఆ చిత్రం సిమ్రాన్‌కు అపజయాన్నే మిగిల్చింది.ఆ తరువాత నాని హీరోగా నటించిన ఆహా కల్యాణం చిత్రంలో అతిథి పాత్రలో మెరిచారు. ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది.అలా అడపాదడపా నటిస్తున్న సిమ్రాన్ ఇటీవల జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటించిన త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు.ఈ చిత్రం విజయం సిమ్రాన్‌కు నూతనోత్సాహాన్నిచ్చిందనే చెప్పాలి. దీంతో ఎప్పటి నుంచో చిత్ర నిర్మాణం ప్రారంభిస్తానంటూ చెబుతున్న సిమ్రాన్ ఇప్పుడందుకు సిద్ధమయ్యారు.
తన భర్త దీపక్ నిర్మాతగా చిత్రాన్ని నిర్మిస్తూ తానే కథానాయికగా నటించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. యాడ్స్ చిత్రాల దర్శకుడు గౌరీశంకర్‌ను ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేయనున్నారు. ఇకపోతే మర్ధాని హిందీ చిత్రంలో రాణిముఖర్జీ పోషించిన పోలీస్ అధికారి లాంటి పవర్‌ఫుల్ పాత్రను సిమ్రాన్ ఈ చిత్రంలో చేయనున్నారని తెలిసింది. ఈ పాత్రకు దీటైన విలన్ పాత్ర కోసం నటుడి అన్వేషణలో ఉన్నారట చిత్ర యూనిట్. సిమ్రాన్ హీరోయిన్‌గా రీఎంట్రీ అయ్యే ఈ చిత్రం వచ్చే నెల సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. మరి ఈ ప్రయత్నం అయినా సిమ్రాన్‌కు లక్ ఇస్తుందా లేక కిక్ ఇస్తుందా? అన్నది వేసి చూడాల్సిందే.