= వీరప్పన్ అనుచ రుల్లో ఆందోళన
= ఆవేదనలో కుటుంబాలు
సాక్షి, చెన్నై: స్మగ్లర్ వీరప్పన్ అనుచరులకు ఉరిభయం పట్టుకుంది. తమ వాళ్లను ఉరి తీయడానికి కర్ణాటక చెరలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అప్జల్ గురు ఉరితీత అనంతరం ఆ శిక్షను ఎదుర్కొంటున్న వారిలో ఆందోళనలు నెలకొన్నాయి. రాష్ట్రంలోని వేలూరు జైల్లో ఉన్న రాజీవ్ హత్య కేసు నిందితులు, కర్నాటక చెరలో ఉన్న వీరప్పన్ అనుచరుల్లో ఉరి భయం వెంటాడుతోంది. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణకు గురి కావడం, కోర్టుల స్టేలతో తాత్కాలికంగా ఉరికి దూరంగా ఉన్నా, ఏ క్షణంలో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందోనన్న భయంతో వీరు కాలం గడుపుతున్నారు.
వీరప్పన్ అనుచరులు: స్మగ్లర్ వీరప్పన్ హతం అయినా, అతడి అనుచరుల జీవితాలు జైళ్లల్లో మగ్గుతున్నాయి. వీరిలో జ్ఞానప్రకాష్, సైమన్, పిలవేంద్రన్, మీసై మాదయ్యన్ ఉరిశిక్ష ఎదుర్కొంటున్నారు. వీరంతా కర్నాటక బెల్గాం జైల్లో ఉన్నారు. వీరిలో మీసై మాదయ్యన్ మాత్రం సేలం జిల్లా మెట్టూరుకు చె ందిన వ్యక్తి కాగా, మిగిలిన ముగ్గురు కర్ణాటక సరిహద్దు గ్రామాలకు చెందిన తమిళులు. 1991, 1993ల్లో కర్ణాటకలో ఓ పోలీసు స్టేషన్‌పై బాంబు దాడి, పాలారులో బాంబు అమర్చి 22 మంది పోలీసులను హతమార్చిన కేసుల్లో తడా చట్టం కింద వీరు అరెస్టు అయ్యారు. వీరికి తొలుత మైసూర్ తడా కోర్టు యావజ్జీవ శిక్షను విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టుకు ఈ నలుగురు అప్పీలు చేశారు.
అయితే, వీరికి యావజ్జీవం సరిపోదని, ఉరి శిక్ష విధించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఖంగుతిన్నారు. తమకు క్షమాభిక్ష పెట్టాలని 2004లో వీరు రాష్ట్రపతికి మొర పెట్టుకోగా, ఇటీవల అది తిరస్కరణకు గురి అయింది. ఈ విషయం బెల్గాం జైల్లో ఉన్న ఆ నలుగురికి తెలియడంతో బంధువులకు సమాచారం అందించారు. దీంతో తమ వాళ్లను ఉరి తీస్తారేమోనన్న ఆందోళన వారిలో మొదలైంది. ఉరితీత ఏర్పాట్లు జరిగినా, సేలం, ధర్మపురి, కృష్ణగిరి, ఈరోడ్ జిల్లాల్లోని మానవ హక్కుల సంఘాలు, తమిళాభిమాన సంఘాలు కోర్టుకు వెళ్లడంతో తాత్కాలిక బ్రేక్ పడింది.
మళ్లీ భయం: కోర్టు తాత్కాలికంగా ఉరి శిక్షను నిలుపుదల చేసింది. అయితే, కోర్టు తాత్కాలిక గడువు కాలం ఈనెలాఖరుతో ముగియనున్నది. సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ ముగింపు దశకు చేరుకుంటోంది. వీరికి ఉరి శిక్షను సుప్రీం కోర్టే విధించి ఉన్న దృష్ట్యా, శిక్షలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు లేవు. దీంతో ఉరి తీత గడువు సమీపిస్తున్నదన్న ఆందోళన ఆ నలుగురిలో మొదలైంది. తమ వాళ్లకు ఆ కేసులతో సంబంధంలేనప్పటికీ, వారిని ఉరి తీయడానికి ప్రయత్నాలు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 13 తేదీలోపు ఉరి తీయొచ్చన్న సంకేతాలతో ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరు అవుతోన్నాయి.
కర్నాటక జైళ్ల శాఖ డీఐజీ వీరభద్రస్వామి నేతృత్వంలో ప్రత్యేక బృందం తరచూ ఆ నలుగురికి వైద్యపరీక్షలు జరుపుతోన్నట్టు కుటుంబీకులు పేర్కొంటున్నారు. ఉరి శిక్ష అమలుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తమకు అనుమానం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అందియూరుకు చెందిన న్యాయవాది జూళియట్ పేర్కొంటూ, ఆ నలుగురి ఉరి శిక్ష నిలుపుదలకు తాను కోర్టులో పోరాడుతూనే ఉన్నానన్నారు. తనకు సహకారంగా రాజకీయ పార్టీలు నిలవాలని, అందరూ కలసి కట్టుగా ముందుకెళ్తే ఉరిని ఆపగలమని చెబుతున్నారు.
పదోన్నతి: వీరప్పన్ వేటలో తనకు పదోన్నతి కల్పించలేదంటూ ఓ అటవీ అధికారి దాఖలు చేసుకున్న పిటిషన్‌కు చెన్నై హైకోర్టు బుధవారం స్పందించింది. వీరప్పన్ వేటలో అటవీ అధికారులు, ప్రత్యేక పోలీసులు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌లో వీరప్పన్‌ను హతమార్చిన అధికారులు, సిబ్బంది అందరికీ పదోన్నతులు, నజరానాలు అప్పట్లో భారీగానే దక్కాయి. అయితే, కోయంబత్తూరుకు చెందిన అటవీ శాఖ సిబ్బంది పుష్పకరన్ కు మాత్రం పదోన్నతి దక్కలేదు. దీంతో కోర్టును ఆయన ఆశ్రయించారు. ఎనిమిదేళ్ల తర్వాత ఎట్టకేలకు ఆయనకు పదోన్నతి కల్పించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెన్నై హైకోర్టు ఆదేశించడం విశేషం.
‘ఉరి’భయం!
Published Thu, Jan 2 2014 5:10 AM | Last Updated on Mon, Oct 22 2018 1:59 PM
Advertisement
Advertisement