అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
చెన్నై: పెరుంగుడిలో అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతిచెందాడు. ఇతను ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా కిందికి తోశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వేలూరు జిల్లా, రాణీపేటకు చెందిన వేలాండి రైతు. ఇతని కుమారుడు అరవింద్ (25). ఇతను చెన్నై ఓల్డ్ మహాబలిపురం రోడ్డులోగల పెరుంగుడిలో ఉన్న ప్రైవేటు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. చెన్నై తిరువాన్మియూరు భారతిదాసన్ వీధిలో ఒక అద్దె ఇంట్లో బాడుగకు ఉంటున్నాడు.
గురువారం రాత్రి అరవింద్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు. ఈలోపు హఠాత్తుగా ఆ సంస్థ ఎనిమిదవ అంతస్తు నుంచి కిందపడ్డాడు. దీంతో రక్తపుమడుగులో ఉన్న అరవింద్‌ను అక్కడి వ్యక్తులు 108 అంబులెన్స్ ద్వారా చెన్నై రాయపేట ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే మార్గమధ్యంలోనే అరవింద్ మృతిచెందాడు. దీనిగురించి కేసు నమోదు చేసిన తురైపాక్కం ఇన్‌స్పెక్టర్ మహేశ్‌కుమార్ అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.