సౌర, పవన వినియోగంతో విద్యుత్ స్వావలంబన
- రాజస్తాన్ గవర్నర్ మార్గరెట్ ఆళ్వా..
- ‘విద్యుత్’కు ప్రత్యామ్నాయాలు వెదకాలని పిలుపు
- బయోగ్యాస్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సలహా
- పునరుత్పాదక విద్యుత్‌పై దృష్టి సారించాలని సూచన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సౌర, పవన విద్యుత్‌లతో పాటు బయోగ్యాస్‌కు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా విద్యుత్ సమస్యకు పరిష్కార మార్గాలను కనుగొనాల్సి ఉందని రాజస్తాన్ గవర్నర్ మార్గరెట్ ఆళ్వా సూచించారు. ఈ రంగాల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను వినియోగిస్తే కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు విద్యుత్ స్వావలంబనకు అవకాశం ఉంటుందన్నారు.
నగరంలో గురువారం ఓ ప్రైవేట్ సంస్థతో కలసి కర్ణాటక వాణిజ్య, పారిశ్రామిక సంఘాల సమాఖ్య ఏర్పాటు చేసిన ‘పచ్చదన శిఖరాగ్ర సమావేశం 2104 -ప్రపంచ పునరుత్పాదక విద్యుత్ శిఖరాగ్ర సమావేశం’ను ఆమె ప్రారంభించి ప్రసంగించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య ఉన్నందున, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరముందన్నారు.
2020-22 నాటికి కనీసం 32 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో పునరుత్పాదక విద్యుత్‌పై దృష్టి సారించాలన్నారు. దేశంలోనే తొలిసారిగా కర్ణాటక సౌర విద్యుత్ విధానాన్ని ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. దీనిని సమర్థంగా అమలు చేయడం ద్వారా విద్యుత్ రంగంలో స్వావలంబనను సాధించాలని ఆమె సూచించారు. రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. తద్వారా విద్యుత్ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవచ్చని చెప్పారు.
బెంగళూరులో స్థిరపడతా
రాజస్తాన్ గవర్నర్‌గా మరో మూడు నెలల్లో పదవీ విరమణ చేస్తానని మార్గరెట్ ఆళ్వా తెలిపారు. తదనంతరం బెంగళూరులో స్థిరపడతానని వెల్లడించారు. సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ కనుమల్లో విద్యుదుత్పాన ప్రాజెక్టులను నెలకొల్పాలన్న ప్రతిపాదనలను వ్యతిరేకించారు. తన జిల్లా ఉత్తర కన్నడలో జల విద్యుత్కేంద్రం, కైగా అణు విద్యుత్కేంద్రాలు ఉన్నందున, మరిన్ని విద్యుదుత్పాదక కేంద్రాలను ప్రారంభించాల్సిన అవసరం లేదని వివరించారు.
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఇలాంటి కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ లేఖలు రాసినట్లు గుర్తు చేశారు. ఒక జిల్లాలో ఎన్ని కేంద్రాలను స్థాపిస్తారని ఆమె ప్రశ్నించారు. అదే పనిగా విద్యుదుత్పాదన కేంద్రాలను ఏర్పాటు చేస్తూ పోతే, అటవీ, పర్యావణ, జన జీవనాలపై దుష్ర్పభావాలు ఉంటాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.