మంత్రికి స్టాలిన్ సవాల్
చెన్నై: అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీగా సాగుతున్న శాసనసభా సమావేశాలు శుక్రవారం పరస్పర సవాళ్లకు దారి తీశాయి. అనేక అంశాలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ డీఎంకే సభ్యులు సమావేశాల నుంచి వాకౌట్ చేశారు.
హొగెనకల్ సహకార సంఘం తాగునీటి పథకంపై వాడివేడిగా చర్చ సాగింది. నగర పాలన, తాగునీటి వసతులపై చర్చలు సాగగా, మంత్రి వేలుమణి ప్రసంగిస్తూ, అమ్మ పథకాలతో రాష్ట్రంలోని కుగ్రామాలు సైతం అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఈ సమయంలో డీఎంకే శాసనసభాపక్ష నేత స్టాలిన్ కలుజేసుకున్నారు.
రామనాథపురం, హొగెనకల్‌లోని సహకార తాగునీటి పథకం పూర్తయి ప్రజలకు తాగునీరు అందుతుంటే సంతోషమేనని అన్నారు. అయితే అక్కడి పథకాలు ఇంకా పూర్తికాలేదని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము, కాదు పూర్తయ్యాయని గౌరవ సభ్యులతో కలిసి వాటిని ప్రత్యక్షంగా చూసి వచ్చేందుకు మంత్రి సిద్ధంగా ఉన్నారా అంటూ స్టాలిన్ సవాల్ విసిరారు.
మంత్రి వేలుమణి స్టాలిన్ సవాల్‌కు స్పందిస్తూ, పథకం పనులు సాగుతున్నచోట జాతీయరహదారి పనులు జరుగుతున్నందున తాగునీటి పథకం పూర్తికి జాప్యం జరుగుతోందని అంగీకరించారు. గాంధేయవాది శశిపెరుమాళ్ ఆకస్మిక మరణం, సంపూర్ణ మద్య నిషేధం, మధురై క్వారీల్లో నరబలులు తదితర 33 అంశాలపై చర్చించేందుకు స్పీకర్ నిరాకరించడంతో డీఎంకే సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.