బలపరీక్ష: తుదిదాకా నిలబడింది వారే!
చెన్నై: తమిళనాట ఉత్కంఠభరితంగా సాగిన రాజకీయ హైడ్రామా ఎట్టకేలకు అనేక ట్విస్టులతో ముగిసింది. తమిళనాడు అసెంబ్లీ వేదికగా జరిగిన బలపరీక్ష ఘట్టంలోనూ అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరివరకు హైవోల్టేజ్ డ్రామా నడిచింది. శాసనసభలో డీఎంకే సభ్యుల ఆందోళన, రాద్ధాంతం, గలాటా, స్టాలిన్‌తో సహా వారిని బలవంతంగా సభ నుంచి మార్షల్ గెంటివేయడం.. ఈ క్రమంలో స్టాలిన్ చొక్కా చినగడం.. చినిగిన చొక్కాతోనే నిరసనకు స్టాలిన్ పూనుకోవడం.. బలపరీక్ష సందర్భంగా ఇలా రోజంతా తమిళనాడు రాజకీయాలు అట్టుడికిపోయాయి. చివరకు శశికళ వర్గానికి చెందిన పళనిస్వామి విశ్వాసపరీక్షలో నెగ్గి.. తన సీఎం పీఠాన్ని పదిలం చేసుకున్నారు.
అయితే, ఈ తుదిఘట్టంలో పన్నీర్ సెల్వం బలమెంతో తేలిపోయింది. శశికళకు ఎదురుతిరిగి.. ఆమె గూటిలో ఉన్న ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనేందుకు ఓపీఎస్ చివరివరకు ప్రయత్నించినా.. ఆయనకు మద్దతుగా నిలిచింది 11మందేనని బలపరీక్ష ద్వారా తేలింది. తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా 231 మంది సభ్యులు హాజరయ్యారు. ఇందులో డీఎంకేకు చెందిన 89మంది సభ్యులపై స్పీకర్ బహిష్కరణ వేటు వేశారు. దీంతో స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ తొమ్మిది మంది కాంగ్రెస్, ముస్లింలీగ్ సభ్యులు వాకౌట్ చేశారు. దీంతో సభలో మిగిలింది 133మంది సభ్యులు. ఇందులో 122 మంది పళనిస్వామికి మద్దతుగా విశ్వాసపరీక్షకు అనుకూలంగా ఓటేయగా.. 11మంది మాత్రమే వ్యతిరేకంగా ఓటేశారు. అంటే.. దాదాపు రెండువారాలపాటు రాజకీయ హైడ్రామాను నడిపిన పన్నీర్ సెల్వానికి చివరివరకు మద్దతు పలికింది ఈ 11 మందే అని చెప్పవచ్చు.