గవర్నర్ అనూహ్య నిర్ణయం!?
- ముంబై పర్యటన వాయిదా
- బలపరీక్షపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ఇన్‌చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు తన ముంబై ప్రయాణాన్ని అర్ధంతరంగా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. శాసనసభ వేదికగా నాటకీయ పరిణామాలు జరగతున్న నేపథ్యంలో ఆయన ముంబై వెళ్లకుండా చెన్నైలోనే ఆగిపోయారు.
ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ అసెంబ్లీకి వెళ్లి.. స్పీకర్ ధనపాల్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ అనూహ్యంగా తన ముంబై ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం గమనార్హం. శాసనసభ వేదికగా బలపరీక్ష ఆసాంతం స్పీకర్ కనుసన్నలలో జరిగింది. ప్రతిపక్ష సభ్యులు లేకుండానే నిర్వహించిన ఈ విశ్వాస పరీక్షలో శశికళ నమ్మినబంటు పళనిస్వామి విజయం సాధించారు. అయితే, తమను బలవంతంగా సభ నుంచి ఈడ్చేయడంతో ఆగ్రహంగా ఉన్న స్టాలిన్ తన ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆయన గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసి విశ్వాసరీక్ష జరిగిన తీరుపై ఫిర్యాదు చేశారు.