
మనకు మనమేతో ప్రజల్లో మార్పు ముగిసిన స్టాలిన్ పయనం
♦ అధికారం తమదేనన్న ధీమా కరుణ ఆశీస్సులు
♦ మనకు...మనమే పర్యటన ప్రజల్లో మార్పును
తీసుకొచ్చిందని, అధికారం తమదేనన్న ధీమాను డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ వ్యక్తం చేశారు. మనకు..మనమే నినాదంతో ఆయన చేపట్టిన పయనం శుక్రవారంతో ముగిసింది.
సాక్షి, చెన్నై : రానున్న ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టి తీరాలన్న కాంక్షతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఆయన వ్యూహాలకు పదును పెట్టే రీతిలో రాష్ట్రంలో ఇంత వరకు ఏ పార్టీ చేపట్టని పర్యటనకు ఎన్నికల ముందు స్టాలిన్ శ్రీకారం చుట్టారు. మనకు..మనమే’ నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్లే దిశగా గత ఏడాది సెప్టెంబర్‌లో కన్యాకుమారి వేదికగా పయనానికి స్టాలిన్ శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో స్టాలిన్ సరికొత్త గెటప్‌తో ముందుకు సాగారు. సరికొత్త గెటప్‌లో స్టైలిష్‌గా ఉన్న స్టాలిన్‌ను అభినందనలు తెలియజేసే వాళ్లుంటే, వ్యంగ్యాస్త్రాలు సంధించే వాళ్లూ ఈ సమయంలో పెరిగారు.
తమిళనాడు సమగ్రాభివృద్ధి, విద్యా, ఉద్యోగ అవకాశాల మెరుగు, ఆర్థికంగా బలోపేతం, మార్పు తదితర అంశాలతో మనకు...మనమే నినాదంతో పాదయాత్ర రూపంలో, సైకిల్ తొక్కుతూ, ఆటో, ట్రాక్టర్ నడుపుతూ, బడ్డీకొట్టుల్లో బజ్జీలు తింటూ, టీ తాగుతూ ఇలా స్టాలిన్ సాగించిన ఈ పర్యటనకు అమిత స్పందనే వచ్చిందని చెప్పవచ్చు. కన్యాకుమారిలో చేపట్టిన పర్యటన శుక్రవారం టీనగర్ నియోజకవర్గంలో ముగిసింది. వ్యాపారులతో సమావేశమై భరోసా ఇచ్చారు. హామీలు గుప్పించారు. టి నగర్ నియోజకవర్గంలోని ప్రజల్ని అప్యాయంగా పలకరిస్తూ, తమకు అండగా నిలవాలని వేడుకోలు పలికారు. ఇక, పర్యటన ముగియడంతో మనకు..మనమే దిగ్విజయవంతమైందని స్టాలిన్ ప్రకటించారు. అధినేత కరుణానిధిని కలుసుకుని ఆశీస్సులు అందుకున్నారు.
మార్పు తథ్యం : మనకు..మనమే పర్యటన విజయవంతం గురించి మీడియాతో స్టాలిన్ మాట్లాడారు. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన పయనం సాగిందని గుర్తు చేశారు. ఎక్కడకు వెళ్లినా ప్రజలు ఆదరించారని, అన్నాడీఎంకే పాలనలో పడుతున్న కష్టాలను తన దృష్టికి తెచ్చారన్నారు. ఈ పర్యటనలో వెలుగు చూసిన ప్రతి అంశం, ప్రతి సమస్యను డీఎంకే పరిష్కరిస్తుందన్నారు. ఎన్నికల అనంతరం కూడా ఈ పయనం సాగుతుందన్నారు. ప్రజలందరిలో చైతన్యం వచ్చి ఉన్నదని, అన్నాడీఎంకే సర్కారును సాగనంపడం లక్ష్యంగా నిర్ణయం తీసుకుని ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో మార్పు అన్నది వచ్చిందని, రానున్న ఎన్నికల ద్వారా డీఎంకే అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అన్నారు. డీఎంకే అధికారంలోకి వస్తే డీఎండీకే అధినేత విజయకాంత్ డిప్యూటీ సీఎం అవుతారా? అని ఈసందర్భంగా మీడియా ప్రశ్నించగా, విజయకాంత్ ఎక్కడైనా ఆ విధంగా చెప్పారా.? అంటూ ఎదురు ప్రశ్న వేశారు.