
నామినేషన్లు షురూ
తిరువళ్లూరు: తిరువళ్లూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సోమవారం ఉదయం డీఎంకే అభ్యర్థి వీజీ రాజేంద్రన్, పీఎంకే అభ్యర్థి బాలయోగి నామినేషన్లు దాఖలు చేశారు. అంతకు ముందు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చిన డీఎంకే నేతలు వీరరాఘవుని ఆలయంలో పూజలు నిర్వహించారు. నామినేషన్ పత్రాలను స్వామి వారి పాదాల వద్ద ఉంచిన తరువాత ర్యాలీగా వచ్చి రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అయన వెంట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చిదంబరంతో పాటూ పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
వంద కోట్లు దాటిన వీజిఆర్ ఆస్తులు: డీఎంకే అభ్యర్థి వీజీ.రాజేంద్రన్ ఆస్తులను అఫిడవిట్‌లో పొందుపరిచారు. భూమి విలువ రూ.38 కోట్లు, భవనాలు రూ.132 కోట్లు, రూ.76 లక్షలు విలువైన కార్లు, రూ.1కోటి బంగారం, తన తో పాటు భార్య పేరుతో ఉన్నట్టు వివరించారు. దీంతో పాటు వివిధ బ్యాంకుల్లో రూ.12కోట్లు అప్పు్పలు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన వద్ద రూ.6లక్షలు భార్య వద్ద రూ.4.59లక్షలు చేతిలో ఉన్నట్టు వివరించారు. తిరువళ్లూరు జిల్లాలో గత 40 సంవత్సరాల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో వంద కోట్లకు పైగా ఆస్తులు కలిగిన వ్యక్తి రాజేంద్రన్ కావడం గమనార్హం.
పీఎంకే అభ్యర్థి నామినేషన్: తిరువళ్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పీఎంకే అభ్యర్థి బాలయోగి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి విఘ్నేశ్వరన్‌కు సమర్పించారు. సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ర్యాలీగా వ చ్చి నామినేషన్ దాఖలు చేశారు. బాలయోగి వెంట దినేష్‌కుమార్‌తో సహా పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.