పదో తరగతి పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. 10.38 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ సారి పరీక్షా కేంద్రాల వద్ద నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. ఆరు వేలకు పైగా స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి.
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ప్లస్‌టూ పబ్లిక్ పరీక్షలు ఈ నెల రెండో తేదీన ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు కట్టుదిట్టమైన ఆంక్షలు, నిబంధనల నడుమ సాగుతున్నాయి. గతంలో ప్లస్‌టూ పరీక్షలు ముగియగానే లేదా, చివరి దశలో ఉన్నప్పుడు పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. అయితే ఈ సారి తక్కువ కాల వ్యవధిలో సాగుతుండడం గమనార్హం. మంగళవారం నాటికి పది పరీక్షలకు తగ్గ అన్ని ఏర్పాట్లు చేశా రు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు పరీక్షా కేంద్రాల వైపుగా విద్యార్థినీవిద్యార్థులు కదిలారు.
10.38 లక్షల మంది: పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది పుదుచ్చేరితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్, ప్రైవేటు విద్యార్తులు 10 లక్షల 38 వేల 22 మంది రాస్తున్నారు. ఇందులో విద్యార్థులు 4.98 లక్షలు, విద్యార్థినులు 4.95 లక్షల మంది ఉన్నారు. 3371 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు తగ్గ అన్ని ఏర్పాట్లు చేశారు. చెన్నైలో 571 పాఠశాలలకు చెందిన 51 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి 229 సెంటర్లను ఎంపిక చేసి, అన్ని ఏర్పాట్లు చేశారు.
పరీక్షలు ప్రారంభం: తొలి రోజు పరీక్షకు ఉదయాన్నే ఎనిమిది, ఎనిమిదిన్నర గంటల కల్లా విద్యార్థులు తమ తమ పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీగా భద్రతా చర్యలు చేశారు. ప్రతి విద్యార్థిని హాల్ టికెట్ల పరిశీలన, క్షుణ్ణంగా తనిఖీల అనంతరం లోనికి అనుమతించారు. సరిగ్గా తొమ్మిది గంటలకు విద్యార్థులను వారికి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టారు. సమాధానాలు రాసేందుకు ఇచ్చిన పత్రాల్లో పేర్లు, ఇతర వివరాలను నింపేందుకు పది నిమిషాలు కేటాయించారు. మరో పదిహేను నిమిషాలు ప్రశ్న పత్రాలను చదువుకునేందుకు అవకాశం కల్పించారు. సరిగ్గా తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్ష నిర్వహించారు. మాస్ కాపీయింగ్, అవకతవకలు జరగకుండా 6,403 ప్రత్యేక స్క్వాడ్‌లను రంగంలోకి దిగి, తనిఖీలు చేశాయి. జైలు శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు పలువురు పరీక్షలు రాయడం విశేషం.
ఇందులో 229 మంది ఖైదీలు ఉండగా, వీరిలో పది మంది మహిళా ఖైదీలు ఉన్నారు. చెన్నై పుళల్, తిరుచ్చి, కోయంబత్తూరు, నెల్‌లై పాళయం కోట్టై జైళ్లల్లో ఖైదీల కోసం పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాతృ భాషలో పరీక్ష రాస్తామో లేదో అన్న ఆందోళన మంగళవారం తెలుగు విద్యార్థుల్లో నెలకొన్న విషయం తెలిసిందే. రాత్రికి రాత్రే ప్రశ్నపత్రాలు సిద్ధం కావడం, తమకు ఎదురైన కష్టాలు వైదొలగడంతో తెలుగు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. మాతృభాషలో పరీక్షలు రాశారు.
పది పరీక్షలు ప్రారంభం
Published Thu, Mar 9 2017 2:38 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM
Advertisement
Advertisement