నేటి నుంచి అసెంబ్లీ
చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మాజీ ముఖ్యమంత్రిగా మారిన తరువాత జరగనున్న తొలి సమావేశాలు కావడం ఈ సారి ప్రత్యేకంగా మారింది. 2011లో సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధించగా ప్రతి అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రతిపక్షాల విమర్శలను జయ దీటుగా ఢీకొన్నారు. ఛమత్కారాలు, పిట్టకథలతో విపక్షాలను ఇరుకున పెట్టేవారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో శ్రీరంగం అసెంబ్లీ సభ్యత్వాన్ని తద్వారా సీఎం పదవిని ఆమె కోల్పోయారు.
కొద్దిరోజుల విరామం తరువాత జయ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా ఉన్న ఓ పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆనవాయితీ ప్రకారం ప్రతి ఏడాది జనవరి మాసాంతంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అయితే సీఎం పీఠంపై జయలేక పోవడంతో జాప్యం జరిగింది. ఎట్టకేలకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అధికార పక్షం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 11.15 గంటలకు గవర్నర్ కే రోశయ్య ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. బుధవారం నుంచి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. 2015 కొత్త సంవత్సర సమావేశాలుగా గవర్నర్ సందేశం ఉంటుంది. 2015-16లో ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రస్తావిస్తూ గవర్నర్ రోశయ్య ఆంగ్లంలో ప్రసంగించిన తరువాత, స్పీకర్ ధనపాల్ అదే ప్రసంగాన్ని తమిళంలో చదివి వినిపిస్తారు.
ప్రతిపక్షాల వ్యూహం
జయకు జైలు శిక్షపడిన తరువాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షాన్ని పూర్తిగా ఇరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. గత శీతాకాల సమావేశాలను కేవలం మూడు రోజుల్లోనే ముగించారు. సమావేశాలను పొడిగించాలని ప్రతిపక్షాలు పట్టుపట్టి విఫలమయ్యాయి. మంగళవారం ప్రారంభమయ్యే సమావేశాలు వారం రోజుల్లో ముగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత సమావేశాల్లో ఈసారి మిన్నకుండరాదని విపక్షాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను, శ్రీరంగం ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, జయకు జైలు శిక్ష, కీలుబొమ్మ ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వంపై విమర్శ, రవాణాసమ్మె, వేతన ఒప్పందంలో జాప్యం తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. శ్రీరంగం ఉప ఎన్నిక లెక్కింపు సాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఉదయం 10 గంటల సమయంలో అకస్మాత్తుగా జయను కలుసుకున్నారు. సుమారు గంటసేపు ఇద్దరూ రహస్యంగా సమావేశం కాగా 11.15 గంటలకు సీఎం వెళ్లిపోయారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే విధానాలపై వారిద్దరూ చర్చించుకున్నారని భావిస్తున్నారు.