State Assembly meetings
-
అసెంబ్లీ సమావేశాలు మూడ్రోజులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మూడ్రోజులపాటు జరగనున్నాయి. అసెంబ్లీ అధికార వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు సమావేశాలను ఈ నెల 30, 31, సెప్టెంబర్ 1న జరపనున్నారు. జీఎస్టీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపేందుకు ఒక రోజు అసెంబ్లీ, మండలి సమావేశం కావాలని ప్రభుత్వం తొలుత పేర్కొన్నప్పటికీ మరో రెండ్రోజులు కూడా సమావేశాలు జరపాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. సమావేశాల తొలి రోజైన 30న జీఎస్టీ బిల్లుపై, 31న కొత్త జిల్లాల ఏర్పాటుపై, సెప్టెంబర్ 1న గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంపై ఉభయ సభలు చర్చిస్తాయని సమాచారం. -
23 నుంచి అసెంబ్లీ సమావేశాలు
- ఉభయ సభలూ ఉదయం 10కి ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ కార్యదర్శి రాజా సదారాం ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులకు లేఖల ద్వారా సమాచారం అందించారు. ‘శాసనసభ, మండలి మూడో సెషన్లో రెండో సమావేశాలు ఈ నెల 23న ఉదయం పది గంటలకు మొదలవుతాయి ..’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించేదీ పేర్కొనలేదు. ప్రభుత్వం ఈ సమావేశాలను కనీసం ఆరు రోజుల పాటు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 23, 24 తేదీల్లో సభ నిర్వహించి వరుసగా నాలుగు రోజుల పాటు (25, 26, 27, 28 తేదీల్లో) సెలవుగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో నాలుగు రోజులు సభ జరిపే వీలుందని తెలుస్తోంది. పది రోజుల పాటు సభ జరపాలన్న చర్చ కూడా జరిగిందని, ఇందులో కనీసం మూడు రోజుల పాటు రైతుల ఆత్మహత్యలు, రైతుల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు తదితర అంశాలపై పూర్తిస్థాయి చర్చ జరపాలని కూడా అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఎన్ని రోజుల పాటు సమావేశాలు జరపాలన్న అంశంపై తొలి రోజున బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. -
24 నుంచి అసెంబ్లీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల 24వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ గురువారం ప్రకటించారు. ఈ సమావేశాలు రెండు వారాలపాటు సాగే అవకాశం ఉంది. 2015-16 బడ్జెట్ సమావేశాలు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నేతృత్వంలో మార్చి 25న ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ బడ్జెట్ దాఖలు చేసిన తరువాత శాఖల వారిగా నిధుల కేటాయింపుపై చర్చ జరగాల్సి ఉంది. అయితే నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి తరువాత తేదీని ప్రకటించకుండానే సభను నిరవధిక వాయిదా వేశారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరిని వలంభిస్తోందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి.కుదిపేయనున్న కీలకాంశాలు: రాబోయే అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత ఏడాది పోరూరు మౌళివాక్కంలో 11 అంతస్తుల అపార్టుమెంటు కుప్పకూలిపోగా 61 మంది శిథిలాల కిందనే ప్రాణాలు విడిచారు. ఈ దుర్ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్నే కాదు దేశాన్నే కలచివేసింది. జయ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసింది. ఈ దుర్ఘటనపై రిటైర్డు న్యాయమూర్తితో విచారణ సాగింది. మౌళివాక్కం ఘటనపై రాబోయే అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తామని మద్రాసు హైకోర్టులో ప్రభుత్వం వాగ్దానం చేసింది. చెన్నై అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపట్టి విమర్శలు గుప్పించిన నేపథ్యంలో మౌళివాక్కంపై ప్రభుత్వం చేసే ప్రకటన వాగ్వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగుతున్న సంపూర్ణ మద్య నిషేధం పోరు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడం ఖాయం. తాము అధికారంలోకి వస్తే మద్యనిషేధం విధిస్తామని డీఎంకే అధినేత కరుణానిధి ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. ఈ నేపథ్యంలో నిషేధం ప్రకటించడమో లేదా టాస్మాక్ దుకాణాల సంఖ్యను తగ్గించడమో ప్రకటించి తీరాలని డీఎంకే సభ్యులు అసెంబ్లీలో పట్టుపట్టే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుపాలై, నిర్దోషిగా బైటపడి ముఖ్యమంత్రిగా మళ్లీ పదవి చేపట్టిన తరువాత జయ ఎదుర్కొనబోతున్న తొలి సమావేశాలు రసవత్తరంగా మారడం ఖాయం. -
నేటి నుంచి అసెంబ్లీ
చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మాజీ ముఖ్యమంత్రిగా మారిన తరువాత జరగనున్న తొలి సమావేశాలు కావడం ఈ సారి ప్రత్యేకంగా మారింది. 2011లో సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధించగా ప్రతి అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రతిపక్షాల విమర్శలను జయ దీటుగా ఢీకొన్నారు. ఛమత్కారాలు, పిట్టకథలతో విపక్షాలను ఇరుకున పెట్టేవారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో శ్రీరంగం అసెంబ్లీ సభ్యత్వాన్ని తద్వారా సీఎం పదవిని ఆమె కోల్పోయారు. కొద్దిరోజుల విరామం తరువాత జయ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న ఓ పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆనవాయితీ ప్రకారం ప్రతి ఏడాది జనవరి మాసాంతంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అయితే సీఎం పీఠంపై జయలేక పోవడంతో జాప్యం జరిగింది. ఎట్టకేలకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అధికార పక్షం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 11.15 గంటలకు గవర్నర్ కే రోశయ్య ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. బుధవారం నుంచి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. 2015 కొత్త సంవత్సర సమావేశాలుగా గవర్నర్ సందేశం ఉంటుంది. 2015-16లో ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రస్తావిస్తూ గవర్నర్ రోశయ్య ఆంగ్లంలో ప్రసంగించిన తరువాత, స్పీకర్ ధనపాల్ అదే ప్రసంగాన్ని తమిళంలో చదివి వినిపిస్తారు. ప్రతిపక్షాల వ్యూహం జయకు జైలు శిక్షపడిన తరువాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షాన్ని పూర్తిగా ఇరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. గత శీతాకాల సమావేశాలను కేవలం మూడు రోజుల్లోనే ముగించారు. సమావేశాలను పొడిగించాలని ప్రతిపక్షాలు పట్టుపట్టి విఫలమయ్యాయి. మంగళవారం ప్రారంభమయ్యే సమావేశాలు వారం రోజుల్లో ముగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత సమావేశాల్లో ఈసారి మిన్నకుండరాదని విపక్షాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను, శ్రీరంగం ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, జయకు జైలు శిక్ష, కీలుబొమ్మ ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వంపై విమర్శ, రవాణాసమ్మె, వేతన ఒప్పందంలో జాప్యం తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. శ్రీరంగం ఉప ఎన్నిక లెక్కింపు సాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఉదయం 10 గంటల సమయంలో అకస్మాత్తుగా జయను కలుసుకున్నారు. సుమారు గంటసేపు ఇద్దరూ రహస్యంగా సమావేశం కాగా 11.15 గంటలకు సీఎం వెళ్లిపోయారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే విధానాలపై వారిద్దరూ చర్చించుకున్నారని భావిస్తున్నారు.