రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల 24వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ గురువారం ప్రకటించారు. ఈ సమావేశాలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల 24వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ గురువారం ప్రకటించారు. ఈ సమావేశాలు రెండు వారాలపాటు సాగే అవకాశం ఉంది. 2015-16 బడ్జెట్ సమావేశాలు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నేతృత్వంలో మార్చి 25న ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ బడ్జెట్ దాఖలు చేసిన తరువాత శాఖల వారిగా నిధుల కేటాయింపుపై చర్చ జరగాల్సి ఉంది. అయితే నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి తరువాత తేదీని ప్రకటించకుండానే సభను నిరవధిక వాయిదా వేశారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరిని వలంభిస్తోందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి.కుదిపేయనున్న కీలకాంశాలు: రాబోయే అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత ఏడాది పోరూరు మౌళివాక్కంలో 11 అంతస్తుల అపార్టుమెంటు కుప్పకూలిపోగా 61 మంది శిథిలాల కిందనే ప్రాణాలు విడిచారు.
ఈ దుర్ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్నే కాదు దేశాన్నే కలచివేసింది. జయ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసింది. ఈ దుర్ఘటనపై రిటైర్డు న్యాయమూర్తితో విచారణ సాగింది. మౌళివాక్కం ఘటనపై రాబోయే అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తామని మద్రాసు హైకోర్టులో ప్రభుత్వం వాగ్దానం చేసింది. చెన్నై అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపట్టి విమర్శలు గుప్పించిన నేపథ్యంలో మౌళివాక్కంపై ప్రభుత్వం చేసే ప్రకటన వాగ్వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగుతున్న సంపూర్ణ మద్య నిషేధం పోరు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడం ఖాయం. తాము అధికారంలోకి వస్తే మద్యనిషేధం విధిస్తామని డీఎంకే అధినేత కరుణానిధి ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. ఈ నేపథ్యంలో నిషేధం ప్రకటించడమో లేదా టాస్మాక్ దుకాణాల సంఖ్యను తగ్గించడమో ప్రకటించి తీరాలని డీఎంకే సభ్యులు అసెంబ్లీలో పట్టుపట్టే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుపాలై, నిర్దోషిగా బైటపడి ముఖ్యమంత్రిగా మళ్లీ పదవి చేపట్టిన తరువాత జయ ఎదుర్కొనబోతున్న తొలి సమావేశాలు రసవత్తరంగా మారడం ఖాయం.