ఆత్మహత్యల ‘రాజధాని’
Published Tue, Oct 22 2013 12:28 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
ఒత్తిళ్లు, నిరుద్యోగం, ఆర్థిక సమస్యల కారణంగా ఢిల్లీలో గత ఏడాది మొత్తం 1,899 మంది ఆత్మహత్య చేసుకోగా వీరిలో 1,246 మంది పురుషులు, 653 మంది మహిళలు ఉన్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఒత్తిళ్లు, కష్టాలు, నిత్యసవాళ్లతో కూడిన నగరజీవితం చాలా మందిని మృత్యుఒడిలోకి నెడుతోంది. మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక రోజుకు కనీసం ఐదుగురు ఢిల్లీవాసులు బలవన్మరణాలకు పాల్పడుతున్నట్టు వెల్లడయింది. ఇలా ప్రాణాలు తీసుకుంటున్న ప్రతి ఐదుగురిలో ఒకరు నిరుద్యోగి కావడం గమనార్హం. ఆత్మహత్యల గణాంకాలను శాతాల వారీగా వర్గీకరిస్తే దాదాపు 20 శాతం మంది నిరుద్యోగులు చావే మార్గంగా ఎంచుకుంటున్నారు. ఢిల్లీ పోలీసులు ఇటీవల వెల్లడించిన రికార్డుల ప్రకారం ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఎక్కువ మంది పురుషులు నిరుద్యోగం కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు 1,246 మంది పురుషులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో 320 మంది మరణానికి కారణం ఉద్యోగం రాకపోవడమే.
ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో మహిళలు ఎనిమిది శాతం వరకు ఉంటున్నారు. పోలీసు రికార్డుల ప్రకారం గతేడాది 653 మంది ప్రాణాలు తీసుకున్నారు. వీరిలో 49 మంది చావుకు నిరుద్యోగం కారణమైంది. వయసుల వారీగా చూస్తే అత్యధికంగా 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్యవారే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాలు దొరక్కపోవడం, అర్హతకు తగిన జీతం లేకపోవడంతో యువత మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. దీంతో వారు చావును మార్గంగా ఎంచుకుంటున్నారని పోలీసులు పేర్కొం టున్నారు. తరువాతి స్థానంలో మహిళలు తనువు చాలించారు. 409 మంది గతేడాది ఆత్మహత్య చేసుకున్నారు. 30 నుంచి 44 ఏళ్ల మధ్యవారిలో 425 మంది ఆత్మహత్య చేసుకున్నుట్ట పోలీసులు తెలిపారు.
వీరంతా ఆర్థిక కారణాలతో మరణించినట్టు పేర్కొన్నారు. కుటుంబ కారణాలతో 355 మంది మహిళలు సైతం బలవర్మణానికి పాల్పడ్డారు. ఎక్కువ మంది శారీరక, మానసిక హింసను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నట్టు పోలీసులు నివేదికల్లో పేర్కొన్నారు. వీరు కాకుండా గతేడాది ఆత్మహత్య చేసుకున్నవారిలో ప్రైవేటు ఉద్యోగులు 280 మంది ఉన్నారు. గతేడాది మొత్తం 1,899 మంది ఆత్మహత్య చేసుకోగా వీరిలో 1,246 మంది పురుషులు, 653 మంది మహిళలున్నారు. వయసుల వారీగా అత్యధికంగా 1,030 మంది 15-29 ఏళ్ల మధ్యవారుండగా, 30-44 ఏళ్లవారు 585 మంది,45-59 ఏళ్ల వారు 178 మంది ఉన్నట్టు పోలీసుల నివేదిక వెల్లడించింది.
యువత చావులకు సర్కార్‌దే బాధ్యత: విజయ్‌కుమార్ మల్హోత్రా
నగరంలో ఏటా వందల సంఖ్యలో యువత నిరుద్యోగం కారణంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం సర్కార్ నిర్లక్ష్యమేనని విధానసభప్రతిపక్ష నాయకుడు విజయ్‌కుమార్ మల్హోత్రా ఆరోపించారు. ఉపాధి అవకాశాలు లేక ఎంతో మంది యువకులు తనువులు చాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు అందరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా రోజుకు ఐదుగురు చొప్పున ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో పదిలక్షల మంది యువతకు ఉపాధి చూపినట్లు ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.
కామన్వెల్త్ గేమ్స్ సమయంలో ఎనిమిది వేలమందికి డ్రైవర్లు, కండక్టర్లుగా ఉద్యోగాలు ఇవ్వడం మినహా ఎక్కడా ప్రభుత్వశాఖల్లోని ఖాళీలను భర్తీ చేయలేదన్నారు. ఎంతో మంది యువత ప్రభుత్వ సహకారం లేక ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి చివరకు ఆత్మహత్యలను పరిష్కారంగా ఎంచుకుంటున్నారన్నారు. అవి నీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌నాయకులకు నిరుద్యోగ యువత కష్టాలు తెలియడం లేదన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ పాలకులకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
Advertisement
Advertisement