సాక్షి, ముంబై: ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నయానే విషయమై స్థానిక తెలుగు ప్రజల్లో ఉత్కంఠత నెలకొంది. లోక్‌సభ ఫలితాలు నేడు వెలువడనున్నందున ఇటు తెలంగాణలో అటు సీమాంద్రలో ఎవరు అత్యధిక స్థానాలను గెలుచుకునే అవకాశముందనే విషయమై ఇప్పటికే ఆరా తీస్తున్నారు. ఇక్కడి తెలుగువారిని ఎవరిని కదిలించినా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకంటే తెంగాణ, సీమాంద్ర ఫలితాల గురించే మాట్లాడుతున్నారు. రెండు కొత్త రాష్ట్రాల్లో ఎవరి ప్రభుత్వం ఏర్పడబోతోందో తెలుసుకోవాలన్న ఆసక్తి వారిలో కనిపిస్తోంది. స్థానిక తెలుగు పత్రికా కార్యాలయాకు ఫోన్లు చేసి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అటు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఉంటున్న తమ బంధువులకు కూడా ఫోన్ చేసి ఎవరు గెలుస్తారనే వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. నగరంలో తెలంగాణతోపాటు సీమాంధ్ర ప్రజలు కూడా చెప్పుకోదగిన స్థాయిలోనే ఉన్నారు. తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్ తదితర తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రజలు అత్యధికంగా ఉన్నారు. సీమాంధ్రలోని కర్నూల్, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూర్‌లతోపాటు ఉభయగోదావరి జిల్లాలవాసులు కూడా పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. వీరిలో కొందరు ఇక్కడే స్థిరపడగా మరికొందరు ఉద్యోగరీత్యా వచ్చినవారు. వీరందరికీ తమతమ స్వగ్రామాలతో స్వగ్రామాలతో సంబంధాలున్నాయి.
ఉద్యమాల్లోనూ ముంబై ముద్ర
ముంబైలో స్థిరపడినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో ముంబైవాసులు కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. తెలంగాణలో జరిగిన ప్రతి కార్యక్రమానికి మద్దతుగా నగరంలో సంఘీభావసభలు నిర్వహించడమే కాకుండా హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జరిగే ఉద్యమ కార్యక్రమాలకు ముంబైనుంచి స్వయంగా వెళ్లి పాల్గొన్నవారు పెద్దసంఖ్యలోనే ఉన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం జరిగిన ఉద్యమాలకు సంఘీభావంగా కూడా నగరంలో అనేక సభలు నిర్వహించారు. ఇలా ఆంధ్రప్రదేశ్ విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలపై ఆసక్తి కనబర్చిన నగరవాసులు ఇప్పుడు అక్కడ వెలువడే ఫలితాల వివరాలను తెలుసుకునేందుకు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇప్పటికే కొందరు ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కార్యాలయాలకు సెలవులు కూడా పెట్టినట్లు తెలిసింది. తెలంగాణలో తెరాస, కాంగ్రెస్, తేదేపా-బీజేపీల కూటమిలో ఎవరికి అధికారం దక్కనుందనే విషయంపై ఇక్కడి తెలుగువారిలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు సీమాంద్రలో వైఎస్సార్సీపీ, తేదేపా-బీజేపీల కూటమి, కాంగ్రెస్ మొదలగు పార్టీల్లో ఎవరికి అధికారం దక్కనుందనే విషయం ఆసక్తి నెలకొంది.
సీమాంధ్రలో వైస్సార్సీపీ విజయం ఖాయం
సీమాంధ్రలో వైఎస్సార్సీపీ విజయం ఖాయమని ముంబైకి చెందిన ఆ పార్టీ నాయకులు మాదిరెడ్డి కొండారెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. కొందరు కావాలనే ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని, లగడపాటి సర్వే కూడా ఓ బూటకమన్నారు. కార్పొరేషన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు స్థానిక అంశాలు, అభ్యర్థుల ఆధారంగా జరిగాయని,అసెంబ్లీ ఎన్నికలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు మద్య జరిగాయన్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్మోహన్‌రెడ్డివైపే మొగ్గుచూపే అవకాశముందన్నా రు. అందిన వివరాల వైఎస్సార్సీపీ 106 నుంచి 136 స్థానాలు సొంతం చేసుకుంటుందన్నారు.
తెలంగాణ, సీమాంధ్ర ఫలితాలపై తెలుగువారిలో ఉత్కంఠ
Published Thu, May 15 2014 10:22 PM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM
Advertisement