పూలమాలలు మార్చుకుంటున్న వధూవరులు
సాక్షి, చెన్నై: తమిళనాడు, కేరళకు చెందిన వధూవరులకు ఆదివారం రాష్ట్ర సరిహద్దులో వివాహం జరిగింది. కోయంబత్తూరుకు చెందిన వరుడికి మూనార్ వచ్చేందుకు ఈ–పాస్ లభించకపోవడంతో నడిరోడ్డుపై ఈ వివాహం నిరాడంబరంగా జరిగింది. తమిళనాడుకు వెళ్లిన వధువును 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. కోవై సమీపంలో శరవణం పట్టికి చెందిన రాబిన్‌సన్ (30). ఇతనికి కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాలోని పళయమోనారుకు చెందిన ప్రియాంక (25)కు వివాహం నిశ్చయమైంది. మూనారులోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో మార్చి 22న వివాహం జరగాల్సి ఉండగా, లాక్‌డౌన్ కారణంగా వివాహం జరగలేదు.
ఇలా ఉండగా అదే సుబ్రమణ్యస్వామి ఆలయంలో గత ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల లోపున వివాహం జరిపేందుకు తీర్మానించారు. ఇందుకోసం వరుడి కుటుంబం మూనారు వచ్చేందుకు ఈ–పాస్‌కు దరఖాస్తు చేయగా, మూనారు – ఉడుమలైపేట రోడ్డులోని తమిళనాడు – కేరళ సరిహద్దు చిన్నారు వరకు మాత్రమే వరుడి కుటుంబం వచ్చేందుకు అనుమతి లభించింది. దీని గురించి వధువు కుటుంబానికి తెలిపారు.
దీంతో ఆదివారం ఉదయం వరుడు కుటుంబీకులు, వధువు కుటుంబీకులు చిన్నారులో కలుసుకున్నారు. తమిళనాడు – కేరళ సరిహద్దులో ఆరోగ్యశాఖ అధికారులు, పోలీసుల సమక్షంలో వధువు ఇంటి వారి తరపున వచ్చిన దేవికుళం మాజీ ఎమ్మెల్యే ఎ.కె.మణి వరుడికి తాళిబొట్టు అందజేయగా రాబిన్‌సన్, వధువు ప్రియాంక మెడలో తాళికట్టారు. వధువుకు తమిళనాడు వెళ్లేందుకు ఈ–పాస్ లభించనందున ఆమె వరుడితో పాటు కోవై శరవణంపట్టికి బయలుదేరారు. వరుడి ఇంటిలో వధువును 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment