తారలు దిగొచ్చేనా? | Tamil Heros Remuneration Goes Down | Sakshi
Sakshi News home page

తారలు దిగొచ్చేనా?

Published Thu, Nov 5 2015 2:52 AM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

తారలు దిగొచ్చేనా?

తారలు దిగొచ్చేనా?

తారలు దిగొచ్చేనా అని ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో చర్చ సాగుతోంది. తారలేంది.. దిగి రావడమేంది.. అనుకుంటున్నారా అయితే ఈ కథనం చదవండి. కోలీవుడ్‌లో ప్రముఖ నటుల పారితోషికాలు చుక్కలనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ముఖ్యంగా నిర్మాతలు నిలబడలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే చిన్న నిర్మాతలు నిలువునా మునిగిపోతున్నారు. పెళ్లాం మెడలో పుస్తులు, ఉన్న ఇళ్లు అమ్మినా సినిమాలను విడుదల చేయలేని పరిస్థితి. పెట్టిన పెట్టుబడులు తిరిగి రాబట్టుకోలేక ఆది చిత్రంతోనే అంతం అయిన నిర్మాతలు చాలా మంది ఉన్నారు. భారీ బడ్జెట్ చిత్రాలు కూడా నష్టాలకు గురిచేయడంతో చాలామంది నిర్మాతలు చిత్ర రంగం నుంచి బయటపడాలని చూస్తున్నారు. జాగోరో జాగో అన్నట్లు చిత్ర పరిశ్రమ ఆలస్యంగానైనా మేల్కొన్నట్లు తెలిసింది. భారంగా మారిన చిత్ర నిర్మాణాన్ని అదుపులోకి తీసుకురావడానికి, ముఖ్యంగా ప్రముఖ నటీనటుల పారితోషికాలు తగ్గించుకోవాలన్న అంశాలపై యావత్ తమిళ చిత్ర పరిశ్రమ త్వరలో సమావేశం కానుంది.
 -తమిళసినిమా
 
 చిత్ర నిర్మాణ సంఖ్య అధికం..
 చిత్ర నిర్మాణాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. 1990 ప్రాంతంలో ఏడాదికి 80 చిత్రాలు మాత్రమే నిర్మాణమయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య 300 వరకూ పెరిగింది. చిన్న బడ్జెట్ చిత్రాల వ్యయం రెండు కోట్లు దాటుతుంటే భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం రూ.60 కోట్లు దాటింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు చిన్న చిత్రాల ఆయువు ఒకటి లేదా రెండు రోజులకు పడిపోయింది. మరో విషయం ఏమిటంటే ఇందులో చాలా మంది నిర్మాతలు కొనుగోలుదారులు లేక పంపిణీదారులు ముందుకు రాక రిస్క్ చేసి సొంతంగా విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి వారు మలి చిత్రం తీసే అవకాశం ఉండడం లేదు. మరి కొంతమంది ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధమై చిత్రాలను విడుదల చెయ్యడానికి మొండిగా ప్రయత్నించినా థియేటర్లు దొరకడం లేదు.
 
 లింగాకు యాగీ..
 సూపర్‌స్టార్ రజనీకాంత్ గతంలో నటించిన బాబా, కుచేలన్ చిత్రాలు పరాజయం పొందటంతో ఆ చిత్ర కొనుగోలుదారులకు రజనీకాంత్ నష్టపరిహారం చెల్లించారు. న్యాయంగా చెప్పాలంటే నటులు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. మానవత్వంతో చేసిన రజనీకాంత్‌ను అందరూ అభినందించారు. అలాంటి పరిస్థితే ఇటీవల లింగాకు ఏర్పడింది. ఆ సమయంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళనలు, నిరాహార దీక్షలు అంటూ పెద్ద యాగీనే చేశారు. ఆ చిత్రానికి రజనీకాంత్ నష్టపరిహారం చెల్లించడానికి ముందుకు వచ్చారు. ఇలానే మరికొందరు ప్రముఖ నటులు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు తమ తదుపరి చిత్రాలను ఇచ్చి లబ్ధి పొందేలా చేస్తున్నారు.
 
 టికె ట్ల వెల తగ్గింపు..
 తమిళ చిత్ర పరిశ్రమ ఇలాంటి ఇక్కట్లను ఎదుర్కొంటున్న పరిస్థితిలో ఇటీవల చెన్నై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వినోదపు పన్ను రాయితీల ఫలం ప్రేక్షకులకే దక్కాలని తీర్పును వెల్లడించింది. దీంతో మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.120 టికెట్ వెలను 85కు తగ్గించాల్సి ఉంటుంది. ఇది నిర్మాతలకు, థియేటర్ల యాజమాన్యాలకు దిగ్భ్రాంతి కల్పించే అంశం. టికెట్ ధర తగ్గింపు అనేది తమకు మరింత భారం పెంచుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. దీని నుంచి బయట పడాలంటే చిత్ర నిర్మాణ వ్యయాన్ని తగించడమే ఏకైక మార్గమనే నిర్ణయానికి వచ్చారు.
 
 
 నష్టపరిహారం చెల్లిస్తున్న నటులు..
 భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలైనా లాభాలు గడిస్తున్నారా అంటే చాలా మంది పెట్టుబడులు కూడా తిరిగి రాబట్టుకోలేకపోతున్నారు. వడ్డీల భారంతో అప్పుల్లో కూరుకుపోతున్నారు. మరో పక్క చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోతే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్ట పరిహారం డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగుతున్నారు.
 
 చుక్కలు చూపిస్తున్న పారితోషికాలు..
 ప్రముఖ నటీనటుల పారితోషికాలు నిర్మాతకు చుక్కలు చూపిస్తున్నాయి. పాపులర్ హీరోలు ఇప్పుడు 25 నుంచి 40 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నారు. యువ హీరోలు 10 నుంచి 20 కోట్లు పుచ్చుకుంటున్నారు. ఇక హీరోయిన్లు తామేమీ తక్కువా అన్నట్లు కోటి నుంచి రెండున్నర కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రముఖ హాస్యనటుడొకరు రోజుకు 10 లక్షల చొప్పున పారితోషికం నిర్ణయించినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. చిత్రం నష్టాన్ని చవిచూస్తే నటీనటులు 20 శాతం పారితోషికం తగ్గించుకోవాలని నిర్మాతల మండలి తీర్మానం చేసినా అది అమలు కావడం లేదు. చిత్ర నిర్మాణ వ్యయం తగ్గించడంలో భాగంగా నటీనటులు పారితోషికాలను తగ్గించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. చిత్ర ప్రముఖులు త్వరలో సమావేశమై నటీనటుల పారితోషికాల తగ్గింపుపై ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే తారలు దిగివస్తారా? నలిగిపోతున్న నిర్మాతలకు చేయూతనిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement