అసెంబ్లీ సమరానికి సర్వం సిద్ధమైంది. అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు ప్రధాన ప్రతి పక్షంతో పాటు కాంగ్రెస్ ఉరకలు వేస్తోంది. ఇక, ప్రప్రథమంగా సభలో బడ్జెట్ దాఖలుకు ఆర్థిక మంత్రి డి.జయకుమార్ సిద్ధమయ్యారు. అలాగే,ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం లక్ష్యంగా స్పీకర్‌పై అవిశ్వాసానికి డీఎంకే కసరత్తుల్లో పడింది.
సాక్షి, చెన్నై: 2017–18 సంవత్సరానికిగాను బడ్జెట్‌ను దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తులే చేసింది. ఈ బడ్జెట్ అటు సీఎం ఏడపాడి పళనిస్వామికి, ఆర్థిక మంత్రి జయకుమార్‌లకు కొత్తే. ఈ ఇద్దరు ఆ పదవులకు ప్రప్రథమంగా ఎంపికైన వారే. ఈ దృష్ట్యా, ప్రభుత్వం దాఖలు చేయనున్న బడ్జెట్‌పై సర్వత్రా ఎదురు చూపులు పెరిగా యి. అమ్మ జయలలిత మరణం తదుపరి దాఖ లు చేస్తున్న బడ్జెట్ పాలకులకు పెను సవాలే. ప్రజాకర్షణ లక్ష్యంగా ముందుకు సాగాలంటే, ఈ బడ్జెట్‌లో భారీ కేటాయింపులు, ప్రత్యేక పథకాలు తప్పనిసరి.
అయి తే, వీటి కి నిధుల కొరత తాండవం చేస్తుండడంతో తాజా బడ్జెట్ ఎలా ఉంటుందోనన్న ప్రశ్న బయలు దేరింది. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగబోతోండడాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏర్పడింది. అలాగే, తన పాలనా దక్షతను చాటుకునేందుకు ఈ బడ్జెట్‌ను పళనిస్వామి కీలకంగా భావించాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు కొత్త భారాన్ని మోపుతారా, లేదా ప్రజల నెత్తిన భారం పడకుండా, కొత్త పథకాలతో ఆకర్షణ మంత్రాన్ని ప్రయోగిస్తారా అన్నది ఈ బడ్జెట్‌లో తేలనుంది. గురువారం ఉదయం పదిన్నర గంటలకు సభ ప్రారంభం కాగానే, బడ్జెట్‌ను జయకుమార్ దాఖలు చేయనున్నారు.
అవిశ్వాసానికి కసరత్తు: బడ్జెట్ దాఖలు అనంతరం అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం అవుతుంది. ఇందులో చర్చించాల్సిన అంశాలు, ముసాయిదాల గురించి, సభ ఎన్ని రోజులు సాగించాలన్న విషయాలపై నిర్ణయం తీసుకుంటారు. ఇందులో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు తగ్గ కసరత్తుల్లో డీఎంకే ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పళనిస్వామి విశ్వాస పరీక్ష సమయంలో స్పీకర్ తీరుపై డీఎంకే తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఈ సమావేశాల్లో ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా డీఎంకే తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఇక, హైడ్రో కార్బన్ తవ్వకాలు, జాలర్లపై దాడులు, శాంతి భద్రతల విఘాతం, రేషన్ కొరత, వంటి అంశాలను అస్త్రంగా చేసుకుని పాలకులతో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే, కాంగ్రెస్‌లు ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యాయి.
ఐదు రోజులకు పరిమితం: బడ్జెట్ సమావేశానికి ఐదు రోజులకు పరిమితం చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. బడ్జెట్ దాఖలు, తదుపరి చర్చలకు ఐదు రోజులు అవకాశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 23వ తేదీ వరకు సభను పరిమితం చేసి, తదుపరి ఏప్రిల్ 18 తర్వాత శాఖల వారీగా నిధుల కేటాయింపులపై చర్చలు సాగించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్టు సమాచారం. ఇందుకు కారణం ఆర్కేనగర్ ఉప ఎ న్నికలే. డీఎంకే అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చిన పక్షంలో చర్చ, ఓటింగ్ వారం రోజుల తదుపరి సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమరం వాడివేడిగా సాగే అవకాశాలు ఉండడంతో, సచివాలయం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సచివాలయంలోకి వాహనాల రాకపోకలకు కఠిన నిబంధనలు, ఆంక్షలు విధించారు.
ప్రతిపక్షాన్ని ఢీకొట్టండి: బడ్జెట్ సమావేశాల్లో తమ మీద సమరం సాగించేందుకు, ప్రభుత్వా న్ని కూల్చడం లక్ష్యంగా అవిశ్వాస తీర్మానానికి డీఎంకే సిద్ధం అవుతున్న సంకేతాలతో అన్నాడీఎంకే మేల్కొంది. ఆగమేఘాలపై పార్టీ ఎమ్మెల్యేలను చెన్నైకు అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పిలిపించారు. శాసన సభా పక్ష సభ్యులందరితో భేటీ అయ్యారు. ప్రతి పక్ష వ్యూహాలు, కుట్రల్ని భగ్నం చేసే విధంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. ఈ సమావేశానికి అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం మీద గెలిచిన ఇతర పార్టీలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. అలాగే, అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినట్టు సమాచారం.
సమరానికి సై
Published Thu, Mar 16 2017 2:52 AM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM
Advertisement